హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఇవాళ అనూహ్యరీతిలో వాయిదాపడింది. సమావేశాల మూడోరోజైన ఇవాళ సభ ప్రారంభమై పట్టుమని పదినిమిషాలు కాకుండాలే స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి విపక్షాలను అవాక్కయ్యేలా చేశారు.
సభ ప్రారంభం కాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలపై పట్టుపట్టాయి. ఎర్రబెల్లి దయాకరరావు అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని కాంగ్రెస్, జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ, వరంగల్ ఎన్‌కౌంటర్‌పై వామపక్షాలు వాయిదా తీర్మానాలను కోరాయి. అయితే వాటిని చర్చకు స్వీకరించని స్పీకర్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో ప్రతిపక్షాల సభ్యులు గందరగోళం సృష్టించారు. ఈలోపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ అంగన్వాడి సమస్యలపై సంబంధిత మంత్రిని పలు ప్రశ్నలు అడిగారు. దీనికి సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం ఇస్తుండగా విపక్షాల గొడవ మరింత పెరిగింది. దీంతో స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. దీనిపై విపక్షాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభను అర్థంతరంగా వాయిదా వేయటానికి నిరసనగా విపక్షాల ఎమ్మెల్యేలు పబ్లిక్ గార్డెన్స్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.