హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం కీలక నేత నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ఇవాళ ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబుకు రు.42.4 లక్షలు, తల్లి భువనేశ్వరికి రు.33 కోట్లు, తనకు రు.7.67 కోట్లు, తన భార్య బ్రాహ్మణికి రు.4.77 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. తనకు చెందిన పది ఎకరాల పొలంలో ఫామ్ హౌస్ కట్టానని తెలిపారు. పాలు, కూరగాయలు అమ్ముకుని హాయిగా, ఆనందంగా బతుకుతున్నామని, చాలా సంతృప్తిగా ఉందని నారా లోకేష్ చెప్పారు. ఏ సిమెంట్ ఫ్యాక్టరీయో, న్యూస్ పేపరో పెట్టుకుంటే ఇంత సంతృప్తి ఉండదని అంటూ జగన్‌పై పరోక్షంగా పంచ్‌లు వేశారు. తమవల్ల తెలంగాణ ప్రభుత్వానికి రు.30 – 40 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. హెరిటేజ్ పాల నాణ్యతపై ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే తన తండ్రితోసహా ఇంట్లో అందరమూ ఆ పాలనే తాగుతామని తెలిపారు. తన విద్యాభ్యాసానికి సత్యం రాజు తదితరులు ఫీజులు కట్టారన్న ఆరోపణలను లోకేష్ తేలిగ్గా కొట్టిపారేశారు. తాను ఎన్టీఆర్ మనవడినని, చంద్రబాబునాయుడు కుమారుడినని, తనకు ఫీజులు కట్టే స్థోమత ఉండదా అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతుల కొడుకులే అమెరికాలో ఫీజు కట్టి చదువుకుంటున్నారని అన్నారు.
హెరిటేజ్ ద్వారానే తమ కుటుంబానికి ఆదాయం లభిస్తుందని, ఆ సంస్థ ప్రస్తుత విలువ రు.913 కోట్లని లోకేష్ తెలిపారు. ఖర్చులు పోనూ రు.30 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. తమదగ్గర ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉందని నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తామని చెప్పారు. తాము ఐదేళ్ళుగా ఈ సవాల్ విసురుతున్నామని, ఎవరూ నిరూపించలేకపోయారని తెలిపారు. అన్ని రాజకీయపార్టీలూ తమమాదిరిగానే ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందని అన్నారు. మరోవైపు చంద్రబాబు ఆస్తులు గత ఏడాదికంటే దాదాపు రు.30 లక్షలు తగ్గటం విశేషం. తనకు రు.70 లక్షల ఆస్తులున్నట్లు గత ఏడాది ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే గత ఏడాది భువనేశ్వరి ఆస్తులు రు.46.88 కోట్లు, లోకేష్‌కు రు.11 కోట్లు, బ్రాహ్మణికి రు.5 కోట్లు ఉండగా వీరందరి ఆస్తులూ ఈ ఏడాది తగ్గాయి. అయినా ఏదో లాంఛనంగా ఇలా ఏదో కాకిలెక్కలు చెబుతారుగానీ, వీళ్ళ వాస్తవ ఆస్తులు – ప్రకటించినమొత్తాలకు ఎన్నో రెట్లు ఉంటాయన్నది ఓపెన్ సీక్రెట్!