తలైవా త్వరలోనే పార్టీ పెట్టేస్తారంటూ తమిళనాడులో ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. జయలలిత మరణం తరువాత తమిళనాడులో ఏర్పడ్డ పొలిటికల్ వేక్యూమ్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ పరిష్కారం చూపిస్తారని తంబీలు ఆశిస్తున్నారు. అంతేకాదు, పార్టీ ఏర్పాటుకు సిద్ధమంటూ తలైవా కూడా సంకేతాలు ఇచ్చారు. అయితే, ఆ పార్టీ ఎప్పుడు వెలుగులోకి వస్తుంది అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేవడం లేదు. కొన్నాళ్ల కిందట జులైలోనే రజనీ పార్టీ ఏర్పాటు ఉంటుందన్నారు. ఇప్పుడేమో ఇంకొన్నాళ్లు పడుతుందని అంటున్నారు. డిసెంబర్ లోగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి.. ఆ తరువాత, పాలిటిక్స్ మీద ఫోకస్ పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంకోపక్క పలువురు ప్రముఖులతో రాష్ట్ర రాజకీయాల గురించి రజనీ చర్చిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తాను రాజకీయాల్లోకి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అంశంపై మేధావులతోపాటు.. కొంతమంది జ్యోతిష్కులను కూడా తలైవా అభిప్రాయం కోరారట!
రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందంటూ ఓ నలుగురు జ్యోతిష్కులను రజనీకాంత్ ఆశ్రయించినట్టు సమాచారం. రాజకీయ రంగ ప్రవేశం చేస్తే… తన స్థానం ఎక్కడ ఉంటుందనీ, కింగ్ మేకర్ అవుతానా కాదా అనే అంశాన్ని తెలుసుకోవడం కోసం నలుగురు జ్యోతిష్కులను వేర్వేరుగా కలుసుకుని, వారి అభిప్రాయాలను రజనీ తీసుకున్నట్టు సమాచారం. వీరిలో ముగ్గురు రజనీ పొలిటికల్ కెరీర్ అద్భుతః అనేశారు. రాణించి తీరతావంటూ లెక్కలు చెప్పి వెళ్లిపోయారట. కానీ, ఒకరు మాత్రం తలైవాకి రాజకీయాలు అంతగా అచ్చి రావంటూ చెప్పారట! ఆశించిన స్థాయిలో ఎదుగుదల ఉండదంటూ రజనీ జాతకాన్ని పడికట్టి ఆయన స్పష్టంగా తేల్చేశారట.
జ్యోతిష్కులను ఆశ్రయించడంతో రజనీ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మెజారిటీ జ్యోతిష్కులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఒకరు నెగెటివ్ గా చెప్పడంతో సూపర్ స్టార్ కాస్త డల్ గా ఉన్నారని అంటున్నారు. అయినా, రాజకీయాల్లోకి రావాలంటే చూడాల్సిందీ, తెలుసుకోవాల్సిందీ ప్రజల్లో తనకున్న ఆదరణని. అంతేగానీ.. దశలూ అంతర్దశలూ నీచభంగ రాజయోగాలూ అంటూ లెక్కలేసుకుని నిర్ణయాలు తీసుకోవడమేంటీ..? ఒక పవర్ ఫుల్ లీడర్ కోసం తమిళనాడు ఎదురు చూస్తోంది. ఆ పవర్ తనలో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రజనీ ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది తన జాతక చక్రంలోని గ్రహ గతులను కాదు… తనలోని నాయకత్వ లక్షణాలని!