అశ్వనీదత్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లా మారిపోయింది.. మహానటి. అలనాటి నటి.. సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతోంది. సమంత, దుల్కర్సల్మాన్, ప్రకాష్‌రాజ్, అనుష్క… ఇలా ఈ సినిమాని మినీ మల్టీస్టారర్ రేంజులో తయారు చేస్తున్నాడు అశ్వనీదత్. అయితే… ఈ సినిమా పేరు బాలీవుడ్ స్థాయిలో్ మార్మోగిపోవాలంటే ఇది సరిపోదు. ఇంతకు మించి కావాలి. సావిత్రి కెరీర్లో కీలకమైన వ్యక్తులు ఏఎన్నార్, ఎన్టీఆర్. వీరిద్దరి పాత్రలూ తెరపై కనిపించాలి. ఆ పాత్రల్ని పోషించేది ఎవరు అన్నదానిపై ఈసినిమా స్థాయి ఆధార పడి ఉంటుంది. అశ్వనీదత్ దృష్టిలో మాత్రం ఎన్టీఆర్ – నాగచైతన్యలే ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మనవళ్లుగా ఆ పాత్రలకు వాళ్లు మాత్రమే న్యాయం చేయగలరన్నది అశ్వనీదత్ ఉద్దేశం.
అయితే ఇప్పటికే ఈ ప్రపోజల్‌ని ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లాడు దత్. కానీ ఎన్టీఆర్ మాత్రం ‘తాతయ్య పాత్ర పోషించలేను’ అని క్లారిటీగా చెప్పేశాడు. నాగచైతన్య కూడా ‘ఎన్టీఆర్ చేస్తే నేను నటిస్తా’ అనే కండీషన్ పెట్టాడట. వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా శర్వానంద్ (ఎన్టీఆర్), నాని (ఏఎన్నార్)ల పేర్లు పరిశీలించినా.. అశ్వనీదత్ మనసు మాత్రం ఎన్టీఆర్, నాగచైతన్యలపైనే ఉంది. అందుకే… ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల పోర్షన్ మాత్రం పక్కన పెట్టి మిగిలిన సినిమా చిత్రీకరణ జరిపేస్తున్నారు. సినిమా అంతా పూర్తయ్యాక.. ఆఖర్లో మరోసారి ఎన్టీఆర్‌ని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం అన్నది అశ్వనీదత్ ఆలోచన. కావాలంటే ఎన్టీఆర్‌కి సావిత్రి సినిమా చూపించాలని, ఆ సినిమా నచ్చి ఎన్టీఆర్ తప్పకుండా నటించడానికి ముందుకొస్తాడని అశ్వనీదత్ భావిస్తున్నారు. ”మా ఆప్షన్ ఇప్పటికీ ఎన్టీఆరే. ఆయనకు ఈ కథ తెలుసు. బాగా నచ్చింది కూడా. కానీ నటించడానికి కాస్త ఆలోచిస్తున్నారు. ఏదో ఓ రోజు తప్పకుండా ఆయన మా టీమ్ లోకి వస్తారు” అని ‘మహానటి’కి పనిచేస్తున్న ఓ సాంకేతిక నిపుణుడు ఆశాభావం వ్యక్తం చేశాడు. చూద్దాం.. ఎన్టీఆర్ మనసు కరుగుతుందో, లేదో??