తెలుగు360 రేటింగ్ 2.25/5
థ్రిల్లర్ సినిమాలు అందరికీ నచ్చవు. వాటిని చూసే ప్రేక్షకుల సంఖ్య పరిమితం. అలాంటి కథల్ని కూడా అందరికీ నచ్చేలా తెరకెక్కించే ప్రయత్నాలు ఈమధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అశ్వథ్థామ కూడా అందులో భాగమే. మరి ఎంతవరకు ఫలితాన్ని రాబట్టింది? లవర్‌బోయ్ ఇమేజ్‌తో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాతో కొత్తగా ఏం చేశాడు? ఆయనే రాసిన ఈ కథ ఎలా ఉంది?
కథ
గణ (నాగశౌర్య) అమెరికాలో ఉంటాడు. తన చెల్లెలు ప్రియ అంటే ప్రాణం. ఆమె నిశ్చితార్థం కోసం ఇంటికొస్తాడు. ఇంతలో ప్రియ ఆత్మహత్యకి సిద్ధమవుతుంది. తాను గర్భవతినని, అందుకు కారణం ఎవరో తెలియదని చెబుతుంది. అంతుచిక్కని ఈ వ్యవహారం గణలో ఆలోచన రేకెత్తిస్తుంది. ఇంతలో అలాంటి కారణాలతోనే మరో అమ్మాయి తనువు చాలిస్తుంది. దీనివెనక అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ముఠా ఉందని గణకి తెలుస్తుంది. అలా ఒకొక్క ఆధారాన్ని సేకరిస్తూ వెళ్లిన గణకి ఎలాంటి విషయాలు తెలిశాయి? దీనంతటికీ కారణమైన సైకో మనోజ్ (జిషు సేన్ గుప్తా) నేపథ్యమేమిటి? అమ్మాయిల్ని గర్భవతిని చేయడం వెనక అతని అసలు లక్ష్యం ఏమిటనేదే మిగిలిన కథ.
విశ్లేషణ
అన్ని దారులూ మూసుకుపోతుంటాయి, ఒక చిన్న ఆధారం మాత్రం దొరుకుతుంటుంది. దాని ఆధారంగానే కథానాయకుడు ప్రయాణం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఎదురయ్యే అనుభవాలే ప్రేక్షకుడిని అడుగడుగునా ఉత్కంఠకి, థ్రిల్‌కి గురిచేస్తుంటాయి. అదే థ్రిల్లర్ కథా చిత్రాల లక్షణం. ఇది కూడా ఆ తాను ముక్కే. ఒక సైకో చుట్టూ సాగే కథ ఇది. ఆరంభ సన్నివేశాలు చూస్తే కుటుంబ ప్రేక్షకులకీ నచ్చేలా తీశారనిపిస్తుంది. కానీ కథలోకి వెళ్లేకొద్దీ యాక్షన్ మోతాదు ఎక్కువైపోతుంది. ఇక ద్వితీయార్థంలోనైతే సైకో వికృత రూపం కుటుంబ ప్రేక్షకుల్ని మరింత దూరం చేసేస్తుంది. నిజానికి ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేయడానికి, ప్రతినాయకుడు క్రూరుడు అని చెప్పడానికి చాలా దారులే ఉన్నాయి. కానీ ప్రేక్షకుడికి ఏమాత్రం మింగుడుపడని దారిని ఎంచుకుని చేశారు. అదే అశ్వథ్థామకి శాపమైంది. ప్రథమార్థం వరకు చిత్రం మంచి టెంపోతోనే సాగుతుంది.
అమ్మాయిల కిడ్నాప్ వెనక సూత్రధారిని కనుక్కునేందుకు చేసే పరిశోధన అడుగడుగునా రక్తికట్టిస్తుంది. ముఖ్యంగా అంబులెన్స్‌లని ఛేజ్ చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలోకి వచ్చేసరికి హింస, అసహ్యరకమైన దృశ్యాల మోతాదు మరింత పెరిగిపోతుంది. ప్రతినాయకుడి పాత్రని, అతని క్రూరత్వాన్నిచూశాక తెలుగు ప్రేక్షకులకి ఈ మోతాదు మరీ శ్రుతిమించినట్టు అనిపిస్తుంది. సినిమా థ్రిల్‌ని పంచడంలో మాత్రం చివరి వరకు సాగుతుంది. పతాక సన్నివేశాల్లో అది మరింత పీక్స్‌కి వెళ్లాల్సి ఉండగా, అక్కడ పట్టు తప్పింది. క్రూరుడైన ప్రతినాయకుడిని, అతని అడ్డాలోనే మట్టుబెట్టడం ఆ సన్నివేశాలు మరీ సాదాసీదాగా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగడం సినిమాకి మైనస్‌గా మారింది. క్రైమ్‌థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాతో నాగశౌర్య యాక్షన్ చిత్రాలకి తగ్గ కథానాయకుడు అనిపించుకోవడం మాత్రం ఆయన కెరీర్‌కి ప్లస్సయ్యే అవకాశాలున్నాయి.
నటీనటులు
నాగశౌర్య నటన మెప్పిస్తుంది. లవర్‌బోయ్ తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన శౌర్య ఈ చిత్రంతో కొత్తదనం పంచాడు. ప్రథమార్థంలో ఎమోషన్స్ కూడా పంచాడు. మెహరీన్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. తొలి పాటలో మాత్రం అందంగా కనిపించింది. జిషు సేన్ గుప్తా సైకోవిలన్గా భయపెట్టాడు. హరీష్ ఉత్తమన్ పాత్రని చూపించిన విధానం కన్ఫ్యూజన్కి గురిచేస్తుంది. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోతగ్గ స్థాయిలో ఏమీ లేదు.
సాంకేతికత
సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుందంతే. సంగీతం మెప్పించదు. దర్శకుడు రమణ తేజ కొన్ని చోట్ల మాత్రమే ప్రతిభ చూపాడు. నిర్మాణవిలువలు ఉన్నతంగా ఉన్నాయి.
తెలుగు360 రేటింగ్ 2.25/5