ప్రేమకథా చిత్రాలకు సరిగ్గా సరిపోతాడు నాగశౌర్య. తన హిట్ సినిమాలన్నీ లవ్ స్టోరీ నేపథ్యంలోంచి వచ్చినవే. తొలిసారి యాక్షన్ వైపు దృష్టి పెట్టాడు. తన సొంత నిర్మాణ సంస్థలో, తను రాసిన కథతో తెరకెక్కుతున్న `అశ్వద్ధామ` యాక్షన్ స్టోరీనే. ఈ సినిమాతో శౌర్య స్నేహితుడు రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు సమంత చేతుల మీదుగా టీజర్ వదిలారు.
ఎలా ఉంటాడో కూడా తెలియని ఓ రాక్షసుడు…
వాడికి మాత్రమే తెలిసిన ఓ రహస్యం
సైరన్ కూతల కింద పని చేసే వాడి సైన్యం
గమ్యం తెలియని ఒక యుద్ధం
ఆ యుద్ధం గెలవాలంటే ఓ ఆరడుగుల నారాయణాస్త్రం కావాలి
ఒక అశ్వద్ధాముడు రావాలి
– అనే డైలాగుతో టీజర్ ని కట్ చేశారు. యాక్షన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది. రొమాంటిక్ శౌర్య కాస్త ఈ సినిమాలో యాక్షన్ హీరోగా మారిపోయాడు. షాట్స్ కట్ చేసిన విధానం, టీజర్లో వినిపించిన డైలాగ్‌ని బట్టి చూస్తే ఓ ఇంటెన్సిటీ కనిపిస్తున్నాయి. శౌర్యలో ఓ సీరియస్, సిన్సియర్ యాంగిల్ చూడొచ్చని పిస్తోంది. అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా – కేవలం కథలోని పాయింట్‌ని మాత్రమే చెప్పే ప్రయత్నం టీజర్లో కనిపించింది. నేపథ్య సంగీతం సైతం ఆ ఇంటెన్సిటీని పెంచింది. మొత్తానికి టీజర్లో విషయం కనిపిస్తోంది. అదే తెరపైనా ప్రతిబింబిస్తే… నాగశౌర్య ఖాతాలో మరో హిట్టు పడడం ఖాయం.