ఈవారం రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకటి.. ‘అశ్వద్ధామ’. రెండోది ‘చూసీ చూడంగానే’. అశ్వద్ధామపై నాగశౌర్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఓ సీరియస్ పాయింట్‌తో సాగే కథ ఇది. ఈ కథని నాగశౌర్యనే రాశాడు. దర్శకత్వ బాధ్యతలు తన స్నేహితుడికి అప్పగించాడు. పైగా నిర్మాత కూడా తనే. ఈ సినిమాపై నాగశౌర్య కుటుంబం చాలా ఖర్చు పెట్టింది. నాగశౌర్య మార్కెట్‌కి మించి పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ప్రచారం కూడా అదే విధంగా చేస్తోంది. ‘నర్తనశాల’తో చేసిన తప్పులు, బాకీలూ ఈ సినిమాతో తీరిపోవాలన్న కృతనిశ్చయంతో ఉంది శౌర్య కుటుంబం. అందుకే అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుని, సరైన విడుదల తేదీ చూసుకుని.. జనవరి 31న తీసుకొస్తున్నారు.
మరోవైపు ‘చూసీ చూడంగానే’దీ ఇదే పరిస్థితి. పెళ్లిచూపులు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో కొత్తవాళ్లకు అవకాశాలిచ్చి, వాళ్లకో దారి చూపించారు రాజ్ కందుకూరి. ఇప్పుడు ఆయన తనయుడు శివ కందుకూరిని ఈ సినిమాతో హీరో చేశారు. నిర్మాతగా చాలామందికి లైఫ్ ఇచ్చిన రాజ్ కందుకూరి, కొడుకు విషయంలో ఏం చేస్తాడో అనే ఆసక్తి నెలకొని వుంది. రాజ్ కందుకూరికి పెద్ద దర్శకుల్ని తీసుకొచ్చి, కొడుకుతో సినిమా చేయించే స్థోమత, స్థాయి ఉన్నాయి. కానీ… అలవాటు ప్రకారం కొత్త దర్శకురాలు, కొత్త టీమ్‌తోనే ఈ సినిమా తీశారు. తన మిగతా సినిమాల్లానే ప్రచారంలోనూ జోష్ చూపిస్తున్నారు. అందరికీ హిట్ ఇచ్చి, కొడుక్కి హిట్ ఇవ్వకపోతే అది చాలా వెలితిగా మారుతుంది. అందుకే ఈ సినిమాతో హిట్ కొట్టడం ఆయనకు తప్పని సరి. శివ పరిస్థితి ఎలా ఉన్నా, రాజ్‌కి మాత్రం ఇది పరీక్షా సమయమే. మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.