ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నిమ్మాడ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థిని బెదిరించారంటూ… మీడియాలో ప్రచారం జరిగింది. నిమ్మాడలో వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అప్పన్న అనే అభ్యర్థి కూడా తనను బెదిరించారని పోలీస్ స్టేషన్్లో ఫిర్యాదు చేసారు. ఆ మేరకు కేసు నమోదు చేయడంతో పాటు ఉదయమే అరెస్ట్ చేశారు. అప్పన్న కూడా కింజరాపు కుటుంబీకుడే. అయితే తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ ఆయన వైసీపీ తరపున పోటీకి సిద్ధమయ్యారు.
మీడియాలో ప్రసారం అయిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అయితే అందులో ఎక్కడా బెదిరించినట్లుగా లేదు. అయినప్పటికీ.. కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పన్న నామినేషన్ విషయంలోనూ నిమ్మాడ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. టెక్కలి వైసీపీ ఇన్చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎత్తున రాడ్లు, కర్రలు తీసుకుని గ్రామంలో హల్ చల్ చేశారు. ఆయన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డుపై కూర్చుని ఆయుధాలున్న తన అనుచరులతో ఎలా దాడి చేయాలో చెబుతూ.. అచ్చెన్నను బూతులు తిడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు కూడా అచ్చెన్న స్వగ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటానికి కారణమని ఆరోపణలు ఉన్నాయి.
అయితే… చివరికి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఎస్ఈసీ కార్యదర్శిని కలిసి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను ఎన్నికలయ్యే వరకూ జైల్లో ఉంచాలన్నారు. ఆ తర్వాత పోలీసులు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు లెక్కకు మిక్కిలిగా జరుగుతున్నాయి కానీ ఎక్కడా ఎవర్నీ అరెస్ట్ చేసినట్లుగా కానీ.. అదుపులోకి తీసుకున్నట్లుగా కానీ లేదు. అచ్చెన్నాయుడినే టార్గెట్ చేశారు.