ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ నడక మొదలుపెట్టారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే, ఈ ప్రసంగంపై టీడీపీ నేతలు వెంటనే స్పందించకపోవడం గమనార్హం! రొటీన్ గా అయితే, జగన్ సభ ముగిసిన వెంటనే టీడీపీ ఎదురుదాడి ఉండాలి. కానీ, పాదయాత్ర విషయంలో మాత్రం కాస్త ఆచితూచి స్పందించాలని భావిస్తున్నారేమో! పాదయాత్రపై మాటలతో ఎదురుదాడి చేసే కంటే.. చేతల్లో చూపించాలని అనుకుంటున్నట్టు సమాచారం. చేతలు అంటే చేరికలు అనే అర్థం. పాదయాత్ర పూర్తయ్యేలోపు వీలైనంతమంది వైకాపా నేతల్ని టీడీపీలోకి చేర్చుకోవాలనేది టీడీపీ అప్రకటిత లక్ష్యంగా కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక తరువాత పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయీ ఉంటాయీ అంటూ కొంతమంది టీడీపీ నేతలు ఊరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ పాదయాత్రకు బయలుదేరిన నేపథ్యంలో అదే మాట మళ్లీ వినిపిస్తోంది.
ఏపీ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… జగన్ పాదయాత్ర గురించి స్పందిస్తే దానికి ప్రాధాన్యత పెంచినట్టు అవుతుందని, కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడదల్చుకోలేదన్నారు. మూడేవేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు జగన్ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తున్న జగన్ చరిత్ర అందరికీ తెలిసిందే అన్నారు. పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వచ్చేసరికి వైకాపా ఖాళీ అయిపోతుందని చెప్పడం గమనార్హం. జగన్ నాయకత్వంపై చాలామంది అసంతృప్తితో ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం విశేషం! నిజానికి, వలసల విషయమై గతంలో కూడా అచ్చెన్నాయుడు ఇలానే స్పందించారు. ఓ అరడజను మంది వైకాపా కీలక నేతలు తనతో టచ్ లో ఉంటున్నారనీ, ఫోన్లు చేస్తున్నారనీ, చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు అంటూ లీకులిచ్చారు.
ఇప్పుడు, యాత్ర పూర్తయ్యేలోపు వైకాపా ఖాళీ అవుతుందని చెప్పడం ద్వారా వలస ప్రస్థావన మళ్లీ తెరమీదికి తెస్తున్నారు. జగన్ పాదయాత్రతో ఫుల్ జోష్ లో ఉన్న వైకాపా వర్గాలను కలవరపాటు గురి చేయడమే లక్ష్యంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు వైకాపా నేతలు మావైపు వస్తున్నారని చెప్పడం ద్వారా ఆ పార్టీకి కాస్త ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే, ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మొద్దో అనే పరిస్థితి పార్టీలో ఏర్పడుతుంది కదా! ఏదేమైనా, పాదయాత్ర తీవ్రతను బలహీన పరచాలంటే టీడీపీ దగ్గరున్న ఆయుధం ఈ వలసల ప్రోత్సాహమే. కాబట్టి, ఈ తరుణంలో కొన్ని వలసలకు ఆస్కారం కచ్చితంగా ఉందనే అనిపిస్తోంది. ఇంకోపక్క, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందన్న భరోసా కూడా టీడీపీకి వచ్చింది. కేంద్రం సానుకూలంగా ఉందని చంద్రబాబు ఈ మధ్యనే చెప్పారు. దీంతో టీడీపీలో చేరితే అవకాశం ఉంటుదనే భరోసా కల్పించే ఆస్కారం కూడా పెరిగింది కదా! ఈ పరిస్థితిని టీడీపీ వాడుకునే అవకాశం కచ్చితంగా ఉంది.