మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందు కొనుగోళ్ల అక్రమాల కేసులో అరెస్ట్ చేశాని ఏసీబీ అధికారిక ప్రకటన చేసింది. ఎలాంటి నోటీసులు లేకుండా… అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం.. కిడ్నాప్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో.. ఏసీబీ వెంటనే స్పందించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నామని .. సాయంత్రానికి ముగ్గురినీ విజయవాడ కోర్టులో హాజరు పరుస్తామని ప్రకటించారు. ఇద్దరు ఈఎస్ఐ మాజీ డైక్టర్లతో పాటు.. అచ్చెన్నాయుడు కూడా.. అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ప్రకటించింది. మొత్తం రూ. 150 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తులో తేలిందని ఏసీపీ అధికారిక ప్రకటనలో తెలిపారు. తాము అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంలో రాజకీయం లేదని.. నిధులు దుర్వినియోగం అయినట్లుగా స్పష్టంగా ఉందన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు. మార్కెట్ ధర కన్నా 50 నుంచి 130 శాతం మేర అధిక ధరలకు కొనుగోలు చేశారని.. టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో టెండర్లు ఇచ్చారని ఏసీబీ చెప్పింది. మందుల కొనుగోలు, టెలీహెల్త్, వేస్ట్ డిస్పోజబుల్ అంశాల్లో ఈ అవినీతి జరిగిందన్నారు. ఈఎస్ఐ స్కాంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదిక ఇచ్చిందని ఏసీబీ ప్రకటించింది.
అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడును పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఓ శాసనసభాపక్ష ఉపనేతను… అసెంబ్లీ సమావేశాలకు నాలుగు రోజుల ముందుగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. దీనిని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఆరోపణలు లేకుండా.. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం.. కేవరం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని మండిపడ్డారు. టీడీపీ నేతలందరూ.. అచత్చెన్నాయుడు అరెస్ట్‌ను ఖండించారు.
మరో వైపు అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులు పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నిన్ననే సర్జరీ జరిగిందని.. ఆయన విశ్రాంతిలో ఉన్నారని.. కనీసం మందులు వేసుకునే సమయం కూడా ఇవ్వకుండా.. తీసుకెళ్లారని.. ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. హఠాత్తుగా.. అచ్చెన్నాయుడు అరెస్ట్.. ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. అచ్చెన్నాయుడు కుటుంబం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంది కానీ.. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. వారికి పెద్దగా ఆస్తిపాస్తులు కూడా లేవు. నిమ్మాడలో.. అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన ఇల్లు కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఉన్నట్లుగానే ఉంది.