ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచికత్తు సమర్పించాలని.. దేశం విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. ఆయన కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు.. టెలీ హెల్త్ సర్వీసెస్‌కు కాంట్రాక్టులు ఇవ్వాలంటూ మూడు లేఖలు రాశారని … అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. ఆయనపై జూన్ పదో తేదీన రాత్రి కేసు నమోదు చేశారు. తర్వాతి రోజు అర్థరాత్రి.. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు.. రెండు వందల మంది పోలీసులతో వెళ్లి ఉదయమే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన విజయవాడ తరలించారు. అంతకు ముందు రోజే ఆయనకు ఆపరేషన్ జరిగినా ఆరు వందల కిలోమీటర్లు వాహనంలో తీసుకెళ్లడంతో ఆయనకు ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. జీజీహెచ్‌లో రెండో సారి ఆపరేషన్ చేశారు .
ఆ తర్వాత పూర్తిగా కోలుకోక ముందు డిశ్చార్జ్ చేసి జైలుకు తరలించారు. తనకు మెరుగైన వైద్యం కావాలని ఆయన అభ్యర్థించడంతో హైకోర్టు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు అంగీకరించింది. అప్పటి నుంచి రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. కొద్ది రోజుల కిందట.. ఆయనకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఓ సారి ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను దిగువ కోర్టు తిరస్కరించింది. విచారణ కీలక దశలో ఉందని… ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రమోద్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు చెబుతూ వస్తున్నారు. ఎంత కాలం అయనను అరెస్ట్ చేయకపోవడంతో.. అచ్చెన్నకు బెయిల్ రాకూడదన్న కారణంగానే ఇలా చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి.
అచ్చెన్నాయుడుకు బెయిల్ రాకుండా… కొంత మందిని కావాలనే అరెస్టు చేయడం లేదని.. విచారణ చేయడం లేదని.. ఉద్దేశపూర్వకంగానే… అచ్చెన్నను జైల్లో ఉంచే ఉద్దేశంతోనే… ఇలా చేస్తున్నారని.. ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. అదే సమయంలో.. అచ్చెన్న అవినీతి చేసినట్లుగా ఆధారాలు లేవని.. ఏసీబీ అధికారి మీడియాకు చెప్పడం కలకలం రేగింది. ఆయనకు ఎక్కడా సొమ్ము అందినట్లు ఆధారాలు లేవని ప్రకటించారు. దీంతో… అచ్చెన్నను కొద్ది రోజులు జైల్లో ఉంచాలన్న పట్టుదలతోనే అరెస్ట్ చేశారన్న విమర్శలు రావడానికి కారణం అయింది.