మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందంటూ జూన్ పన్నెండో తేదీన ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్ట్ చేశారు. అంతకు ముందు రోజే ఆపరేషన్ జరిగిందని చెప్పినా ఆయనను నిమ్మాడలో అరెస్ట్ చేసి.. ఇరవై గంటల పాటు రోడ్డు మార్గం ద్వారా.. ప్రయాణం చేయించి విజయవాడ తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆపరేషన్ గాయం తిరగబెట్టింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రెండో సారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత గాయం తగ్గక ముందే ఆయనను డిశ్చార్జ్ చేసేసి జైలుకు తరలించారు. తనకు మెరుగైన వైద్యం కావాలని ఆయన అభ్యర్థించడంతో హైకోర్టు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు అంగీకరించింది. అప్పటి నుంచి రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయం స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు కరోనా టెస్ట్ చేశారు. దీంతో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతీ వారం.. రమేష్ ఆస్పత్రి వైద్యులు కోర్టుకు నివేదిక సమర్పిస్తున్నారు.
కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని కూడా బులెటిన్ ద్వారా హైకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే అచ్చెన్నాయుడు.. ఏసీబీ కోర్టు.. హైకోర్టులను బెయిల్ కోసం ఆశ్రయించారు. అయితే రెండు చోట్ల ఆయనకు నిరాశ ఎదురయింది. దీంతో రిమాండ్‌లోనే ఉండాల్సి వస్తోంది.