అచ్చెన్నాయుడిని ప్రవైటు ఆస్పత్రికి తరలిచాలని హైకోర్టు ఆదేశించింది. తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని .. ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలంటూ… అచ్చెన్న పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. ఏ ఆస్పత్రికి తరలిచాలన్నది కూడా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది చేసిన డిమాండ్‌ను.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో.. ఏ ఆస్పత్రిలో చేరాలన్నది అచ్చెన్నాయుడు నిర్ణయించుకునే అవకాశం ఉంది.
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ.. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో… హడావుడిగా డిశ్చార్జ్ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆయనను డిశ్చార్జ్ చేసి.. విజయవాడ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అంతకు ముందే అచ్చెన్న .. తన ఆరోగ్య పరిస్థితి బాగో లేదని ప్రైవేటు ఆస్పత్రికి తరలించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ఆపరేషన్ జరిగిన తర్వాతి రోజే కనీసం ప్రాథమిక విచారణ లేకుండా అరెస్ట్ చేశారని.. పోలీసుల తీరు వల్ల తనకు రెండో సారి ఆపరేషన్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అచ్చెన్నను ప్రైవేటు ఆస్పత్రికి తరలిచాలని ఆదేశించింది. అచ్చెన్నకు అత్యున్నత వైద్యం అవసరం లేదని… ఆయన బాగానే ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. మరో వైపు హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ కూడా విచారణకు రావాల్సి ఉంది. ఏసీబీ కోర్టు తన పిటిషన్‌ను కొట్టి వేయడంతో.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల కస్టడీ కూడా పూర్తయిందని.. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నానని… బెయిల్ పిటిషన్లో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.