తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతూంటే సర్వేలూ బయటకు వస్తున్నాయి. మొన్న ఆరా మస్తాన్ అనే వ్యక్తి సర్వే వదిలాడు. ఆయన సర్వే చుట్టూ చాలా రచ్చ జరిగింది. తీరా చూస్తే ఆయన బీజేపీ సభల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ‘ఆత్మసాక్షి’ గ్రూప్ సర్వే ప్రకటించంది. టీఆర్ఎస్దే గెలుపని ఆ సర్వేలో తేలింది.
ఆత్మసాక్షి సర్వే ప్రకారం.. టీఆర్‌ఎ్‌సకు 39.5% ఓట్లతో 56 నుంచి 59 స్థానాలు రానున్నాయి. కాంగ్రె్‌సకు 31.5% ఓట్లతో 37 నుంచి 39 దాకా స్థానాలు వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 21% ఓట్లు.. 14 నుంచి 16 దాకా సీట్లు వస్తాయని వెల్లడైంది. పలు జిల్లాల్లో టీఆర్‌ఎ్‌స-కాంగ్రె్‌సల మధ్యనే పోటీ ఉంటుందని.. కొన్ని జిల్లాల్లో మాత్రం మూడుపార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నామని ఆత్మసాక్షి చెబుతోంది.
ఆత్మసాక్షి చేసిన సర్వేలు గతంలో కొన్ని నిజమయ్యాయి. అయితే యూపీలో చేశామంటూ ఇచ్చిన సర్వే అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఈ సర్వేకూ ప్రామాణికత తగ్గిపోయింది. అయితే ఇప్పుడు సర్వేలు జనాలను ప్రభావితం చేసే పరిస్థితి లేదు. ఎవరికి వారు సొంత సర్వేలను హైలెట్ చేసుకుంటున్నారు. నిజానికి సర్వే చేయాలంటే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అలాంటి సామర్థ్యం లేని సంస్థలు సర్వే నివేదికలు వెల్లడిస్తూ.. కాస్త ప్రచారం తెచ్చుకుంటున్నాయి.