ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు.
కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నారు అనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. చివరకు అతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా.. ఆప్ ఎమ్మెల్యేలంతా ఆ ప్రతిపాదనను ఆమోదించారు. దీంతో ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. ఇంతకుముందు బీజేపీ తరఫున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
అతిశీ.. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకమైన మంత్రులలో ఒకరు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన సమయంలో ఆమె నేతృత్వంలోనే ఆప్ ఆందోళనలకు దిగింది. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో ఆప్ తరఫున ఎవరు జెండా ఎగరేయాలనే విషయంపై.. జైలు నుంచి తన నిర్ణయాన్ని కేజ్రీవాల్ ప్రకటిస్తూ అతిశీ పేరును ఖరారు చేశారు.
ఇక, ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం సమయంలోనే పార్టీలో చేరారు అతిశీ. 2013ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమెకు అవకాశం ఇచ్చారు. పార్టీలో యాక్టివ్ రోల్ పోషించిన అతిశీకి ఆప్ అధికార పార్టీ ప్రతినిధిగా అవకాశం ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంలో అతిశీ కీలకమైన విద్యాశాఖ, నీటి , రెవెన్యూ , ఫైనాన్స్ శాఖలను నిర్వర్తిస్తున్నారు.