AtithiDevo Bhava Review
తెలుగు360 రేటింగ్: 1.5/5
సినిమాలకు కథలొద్దు.. కాన్సెప్టులు చాలు అని నమ్మే కాలంలో ఉన్నాం. ఈమధ్య వచ్చిన చాలా హిట్లు.. కాన్సెప్టులతో ముడి పడిన కథల నుంచి పుట్టిన సినిమాలే. హీరోకి ఓ లోపం పెట్టి – దాని చుట్టూ కథల్ని నడిపించేసిన ఘనాపాటిలు ఉన్నారు. గజినిలో.. హీరోకి షార్ట్ టైమ్ మెమొరీ లాస్. అది సూపర్ హిట్టు. గజిని లో హీరోకి ఉన్న లోపమే… సరదాగా మార్చేస్తే – భలే భలే మగాడివోయ్.. అది కూడా హిట్టే. అయితే కాన్పెప్టుల్ని నమ్మిన ప్రతీ సినిమా హిట్టే అనుకోకూడదు. `బాబు బంగారం` ఏమైంది? అదీ కాన్సెప్టు కథే. ఇక్కడ తేలిందేమిటంటే… కాన్సెప్టు ఏమిటన్నది కాదు, దాన్ని ఎంత కొత్తగా, ఎంత ఎంగేజ్ గా చెప్పామన్నదే ముఖ్యం. ఇప్పుడు అతిథి దేవోభవ కూడా ఓ కాన్సెప్టు చుట్టూ అల్లిన కథే. ఒంటరితనం అంటే భయపడిపోయే హీరో చుట్టూ అల్లిన కథ. మరి ఈ కాన్సెప్టు ఎలా ఉంది? దాని చుట్టూ నడిపించిన సన్నివేశాల్లో ఎంత బలం ఉంది?
అభయ్‌రామ్(ఆది సాయికుమార్)…. కథ ఇది. పేరుల అభయం ఉన్నా.. బతుకంతా భయమే, మోనో ఫోబియాతో అనే జబ్బుత బాధపడుతుంటాడు. అంటే… ఒంటరితనం అంటే భయం అన్నమాట. ఎక్కడకు వెళ్లినా.. తోడు ఉండాల్సిందే. అయితే.. ఈ విషయం అమ్మ (రోహిణి)కి మాత్రమే తెలుసు. ఈ లోపం వల్లే జీవితంలో చాలా కోల్పోతాడు. ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని కూడా. కొన్నాళ్లకు తన జీవితంలో కి వైష్ణవి(నువేక్ష) ప్రవేశిస్తుంది. తనలోని లోపం గురించి తెలిస్తే.. వైష్ణవి కూడా తనకు దూరం అవుతుందన్నది అభయ్ భయం. మరి తన లోపం గురించి తనకు చెప్పాడా? చెప్పకుండా దాచాడా? వాటిమధ్య తను ఏమేర మధన పడ్డాడు? తన మోనో ఫోబియా నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే కథ.
కథ ఎలాంటిదైనా, దాన్ని మలిచే విధానంలోనే నేర్పు ఉంటుంది. ఒంటరితనం అంటే భయపడే ఓ కుర్రాడి కథ ఇది. దాన్ని ఏ రూపంలో చెప్పాలి? నవ్విస్తూ చెప్పాలా? ఎమోషనల్ గాచెప్పాలా? లేదంటే ప్రేక్షకుల్ని కూడా భయపెట్టేలా సినిమా తీయాలా? అనే విషయాల్లో దర్శకుడికి ఓ క్లారిటీ ఉండి తీరాలి. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలు హిట్టయ్యాయంటే కారణం.. ఆ సినిమాల్లో చూపించిన లోపం వల్ల కాదు. ఆ లోపం చుట్టూ పండిచిన సన్నివేశాల వల్లే. ఈ కథల్ని కామెడీగా చెప్పాలి.. అని మారుతి ఫిక్సయి రాసుకున్న కథలు అవి. కాబట్టి.. ఆ కామెడీలో లాజిక్కులు కూడా కొట్టుకుని వెళ్లిపోయాయి. `అతిథి దేవో భవ`లో కాన్సెప్ట్ ఉంది. కానీ… దాన్ని ఎలా చెప్పాలి? అనే విషయంలో దర్శకుడికి క్లారిటీ లేకుండా పోయింది.
తొలి పది నిమిషాల్లో కథానాయకుడి లోపం, ఆ క్యారెక్టరైజేషన్ అర్థమైపోయాయి. ఆ తరవాత.. ఆ లోపం వల్ల ఎంత ఫన్ వచ్చింది అనేదే ముఖ్యం. సినిమా ప్రారంభమై అర్థ గంట గడిచినా … ఆ కథ హీరోకున్న మోనో ఫోబియా చుట్టూనే తిరిగితే… ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది? భయం అనే కాన్సెప్టుతో ప్రేక్షకుల్ని ఎంతైనా నవ్వించొచ్చు. పైగా.. ఇక్కడ దర్శకుడికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే.. అభయ్ మోనో ఫోబియా గురించి అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. కాబట్టి.. చుట్టు పక్కల పాత్రల నుంచి కావల్సినంత వినోదం పిండొచ్చు. కానీ అది ఇక్కడ జరగలేదు. తొలి సీన్ లో దర్శకుడు ఏం చెప్పాడో.. 20 వ సీన్లోనూ అదే జరుగుతూ ఉంటుంది. రిపీటెడ్ సన్నివేశాన్ని, ఎమోషన్‌నీ మళ్లీ మళ్లీ చూసిన ఫీలింగ్ ఆడియన్ కి కలుగుతుంది.
ద్వితీయార్థంలో పూర్తిగా డార్క్ షేడ్ తీసుకుంది కథ. ఇక్కడ.. ప్రేక్షకుడ్ని, కథలోని పాత్రల్నీ భయపెట్టాలని చూశాడు దర్శకుడు. అది కూడా వర్కవుట్ కాలేదు. ఆది పాత్రని అండర్ ప్లే చేయించడం ప్రధానమైన లోపం. ఆ పాత్రని జోవియల్ గా మార్చి, అతని ఫోబియా వల్ల మిగిలిన వాళ్లంతా భయపడినట్టు చూపిస్తే.. కచ్చితంగా వర్కవుట్ అయ్యే సినిమానే. సప్తగిరిని తీసుకొచ్చి, కొంతకామెడీ చేసి `ఈ సినిమాలో కామెడీ కూడా ఉంది` అని చెప్పే ప్రయత్నం చేశాడే తప్ప, ఆ సన్నివేశాలు కథలో ఇమడలేకపోయాయి. హీరోకి ఓ ఫోబియా ఉంది. దాన్ని ఎమోషనల్ గా చెప్పాలనుకున్నాడు దర్శకుడు. పోనీ.. ఆ రూపంలో అయినా హీరో పాత్రపై సానుభూతి అయినా కలగాలి. అదీ జరగలేదు. అటు కామెడీ, ఇటు ఎమోషన్ రెండింటికీ దూరంగా.. అతిథి దేవో భవ మిగిలిపోయింది. లవ్ ట్రాక్ అయినా కొత్తగా ఉందీ అనుకుంటే, అదీ జరగలేదు. పోలీస్ స్టేషన్ సీన్, దానికి లీడ్ గా వచ్చే సన్నివేశాలు.. ఇవన్నీ పేలవంగా నడిచాయి. పతాక సన్నివేశాలూ బలంగా లేవు.
కాన్సెప్టుల్ని నమ్ముకున్నప్పుడు స్క్రిప్టు దశలో చాలా కష్టపడాలి. రచయిత పనితనం చూపించాలి. అది ఈ సినిమాలో జరగలేదు. కాన్సెప్టుని నిలబెట్టే సన్నివేశాలేం ఈ సినిమాలో లేకపోవడం పెద్ద లోపం. క్యారెక్టరైజేషన్లు బలంగా లేకపోవడం, ఫన్, ఎమోషన్ ఇవి రెండూ పండకపోవడం.. శాపాలుగా మారాయి. `బాగుంటుంది` పాట వినడానికి బాగున్నా.. చూడ్డానికి యావరేజ్ స్థాయి దగ్గరే ఆగిపోయింది. నేపథ్య సంగీతం చూస్తే.. ఓ హారర్ సినిమా ఫీలింగ్ వచ్చింది.
ఆది సాయికుమార్ కొత్తగా చేసిందేం లేదు. ఎమోషన్ సీన్లలో పట్టీబట్టి నటించినట్టు అనిపించింది. తను ఫైట్స్ బాగా చేయగలడు. డాన్సులు బాగుంటాయి. ఆ బలాల్నీ సరిగా వాడుకోలేదు. సువేక్ష ఓకే అనిపిస్తుంది. గ్లామర్, నటన అంతంత మాత్రమే. అమ్మ పాత్రలో రోహిణి మరోసారి ఒదిగిపోయింది. తల్లీ కొడుకుల సెంటిమెంట్ కాస్త పండిందంటే కారణం తనే. సప్తగిరి లౌడ్ కామెడీ ఈసారి వర్కవుట్ కాలేదు. తారాగణంలో చాలామందే ఉన్నా – ఎవరికీ నోటెడ్ పాత్ర దక్కలేదు.
కాన్సెప్టు ఏదైనా సరే, దాన్ని నిలబెట్టేది కచ్చితంగా సన్నివేశాలే. ఆ సన్నివేశాల లోపం.. అడుగడుగునా కనిపించింది. అందుకే ప్రతీ సీన్లోనూ అతిథి దేవో భవ నిరాశ పరిచింది.
ఫినిషింగ్ టచ్: కాస్త.. ఓపిక దేవో భవ
తెలుగు360 రేటింగ్: 1.5/5