ఇండియన్ సినిమాకి ఆస్కార్ అందని ద్రాక్ష అనేది ఒకప్పటి మాట. రాజమౌళి దయ వల్ల… భారతీయ సినిమాలు ఆస్కార్‌ని అందుకోవడం అసాధ్యం కాదని తేలిపోయింది. అందుకే ఇప్పుడు ఆస్కార్ కలలు మరింత ఎక్కువయ్యాయి.కమర్షియల్ సినిమాల్ని సైతం ఆస్కార్‌కు పంపాలని, దేశం తరపున అధికారికంగా నామినేషన్ దక్కకపోయినా, ప్రైవేట్ నామినేషన్ రూపంలో అయినా ఆస్కార్ దక్కించుకోవచ్చని మన దర్శకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా `జవాన్` లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన అట్లీ కూడా ఆస్కార్ కలలు కంటున్నాడు. ఈ సినిమాని ఆస్కార్ కి పంపాలన్నది అట్లీ ఆశ. ఈ విషయాన్ని దాచుకోకుండా చెప్పేశాడు. అన్నీ కలిసొస్తే… జవాన్ని ఆస్కార్‌కి పంపుతామని, ఈ విషయంలో షారుఖ్ తనకు అండగా ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు అట్లీ.
ఈ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్నాడు అట్లీ. ఆర్.ఆర్.ఆర్ కోసం రాజమౌళి గ్లోబల్ స్థాయిలో విస్కృతమైన ప్రచారం చేశాడు. ముఖ్యంగా గోల్డెన్ గ్లోబ్ కి ఆర్.ఆర్.ఆర్ని తీసుకెళ్లి, అక్కడి నుంచే ఆస్కార్‌కి బాటలు వేశాడు. సరిగ్గా అట్లీ ది కూడా ఇదే ప్లాన్. ముందు గోల్డెన్ గ్లోబ్ వరకూ, ఈ సినిమాని తీసుకెళ్లి, అట్నుంచి ఆస్కార్ వేదికపై నిలబెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి నుంచే అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రానికి ప్రమోషన్లు కల్పించాలనుకొంటున్నాడు. ”జవాన్ కోసం చాలా మంది చాలా రకాలుగా కష్టపడ్డారు. ఆ కష్టానికి ఎలాంటి పురస్కారం వచ్చినా ఆనందంగా స్వీకరిస్తా. షారుఖ్ అండగా ఉంటే… ఆస్కార్‌కి కూడా ఈ సినిమాని పంపిస్తా” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అట్లీ.