మూడు రాజధానులకు మద్దతుగా ఇతర ప్రాంతాల నుంచి తమ ప్రాంతాల్లోకి వచ్చి ఆందోళన చేయాలనుకున్న వారిని అడ్డుకున్న కేసులో రాజధాని రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ఫిర్యాదు చేసిన వారు ఉపసంహరించుకుంటూ లేఖ ఇచ్చినా ఒప్పుకోలేదు. వారి చేతులకు బేడీలు వేసి.. జైలుకు తీసుకెళ్లారు. వారిపై నమోదు చేసిన కేసుల్లో వాస్తవంగా.. స్టేషన్ బెయిల్ రావాలి. కానీ వారికి బెయిల్ ఇవ్వకూడదన్న లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే.. వారు కూడా ఎస్సీలే. దేశ చరిత్రలో ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనతను.. ఏపీ పోలీసులు సాధించారు. పోలీసులు పెట్టిన కేసులను చూసినప్పుడే న్యాయనిపుణులు విస్మయం వ్యక్తం చేశారు.
ఇలాంటివి చేసి.. చివరికి న్యాయస్థానాల్లో చివాట్లు తింటారని.. ఆనక.. ఇతరులు మేనేజ్ చేశారని నిందలేస్తారని విమర్శించారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎస్సీలపై అట్రాసిటీ కేసు పెట్టడం ఏమిటని హైకోర్టు నేరుగానే ప్రశ్నించింది. ఈ విషయంలో కేసులు పెట్టిన పోలీసులు.. నిబంధనలకు పట్టించుకోకుండా.. యాంత్రికంగా రిమాండ్కు తరలించి.. బెయిల్ నిరాకరించిన న్యాయాధికారి కూడా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అట్రాసిటీ కేసులు కాకుండా.. పెట్టిన మిగతా సెక్షన్లు.. బెయిలబుల్వేనని.. తప్పుడు కేసులు పెట్టి… వారి వ్యక్తిగత స్వేచ్చను హరించే హక్కు ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది.
ఇప్పుడీ కేసు కొంత మంది మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. పై నుంచి వచ్చిన ఒత్తిడితో అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు… న్యాయం చేస్తే.. ఎవరికి ఎక్కడ వస్తుందోనని భయపడిన వారికీ.. ఇలా చాలా మంది ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకున్నా… ఈ ప్రభుత్వం పాటించదు కాబట్టి..ఈ వ్యవహారంల ోఉన్న పోలీసులు కొంత కాలం సేఫ్గా ఉండొచ్చు. కానీ ఎల్లకాలం ఉండలేరు. ఖచ్చితంగా ఇరుక్కుపోవాల్సి ఉంటుదంని అంటున్నారు.