భారత్ లో కూడా ఐసిస్ ఉగ్రవాదం చాపక్రింద నీళ్ళలా తెలియకుండా వ్యాపిస్తోందని మళ్ళీ మరొకసారి స్పష్టమయింది. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హసన్ ఫరూక్, ఒమర్ ఫరూకి మరియు అబ్దుల్ వసీం ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు ఐసిస్ ఉగ్రవాద కలాపాల పట్ల ఆకర్షితులయ్యి అందులో చేరేందుకు నేడు నాగపూర్ నుండి శ్రీనగర్ వెళ్ళే విమానం ఎక్కబోతుంటే వారిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ బృందానికి చెందిన పోలీసులు అరెస్ట్ చేసారు. వారు ముగ్గురూ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం గుండా నాగపూర్ చేరుకొన్నట్లు తెలిపారు. ఎందుకంటే వారి ముగ్గురిపై హైదరాబాద్ పోలీసులు నిఘా పెట్టారు.
వారిలో ఒకడు ఇదివరకే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి, ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకొని తిరిగివచ్చేడు. ఆ తరువాత మిగిలిన ఇద్దరిలో ఒకరిని వెంటబెట్టుకొని ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు బయలుదేరినపుడు హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పుడు వారిద్దరికీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి విడిచిపెట్టారు. అప్పటి నుంచి వారిపై నిఘా పెట్టారు. ఆ సంగతి తెలుసుకొన్న వారు ఈసారి పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకొన్నారు. కానీ వారి కదలికల్ని జాగ్రత్తగా గమనిస్తున్న హైదరాబాద్ పోలీసులు తక్షణమే మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ పోలీసులకు సమాచారం ఇవ్వగానే వారు ఆ ముగ్గురు యువకులను శ్రీనగర్ విమానం ఎక్కుతున్న సమయంలో అరెస్ట్ చేసారు.
వారిని ప్రశ్నించగా, తాము శ్రీనగర్ నుండి పాకిస్తాన్ లోకి ప్రవేశించి అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రోడ్డు మార్గంలో సిరియా చేరుకోవాలనుకొంటున్నట్లు వివరించారు. ఉన్నత విద్యావంతులయిన యువకులు కూడా ఉజ్వలమయిన భవిష్యతును, తమపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న తల్లితండ్రులను అందరినీ కాదనుకొని ఈవిధంగా ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ప్రాణాలకు తెగించి ఐసిస్ ఉగ్రవాదులలో ఎందుకు చేరాలనుకొంటున్నారో..ఉగ్రవాదంవైపు అసలు ఎందుకు ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవలసిన అవసరం ఉంది.