వైసీపీ నేతలు కట్టుదాటి పోతున్నారు. చివరికి రైతులపై దాడికి పాల్పడుతున్నారు. చాలా స్పష్టంగా వైసీపీ నేతలు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ షీటర్లను ఆర్గనైజ్ చేసుకుని మరీ దాడులకు పాల్పడ్డారు. రాజమండ్రిలో రైతుల పాదయాత్ర ఉన్న దారిలోనే వైసీపీ నేతలు రెండు, మూడు వందల మందిని సమీకరించి.. సభ ఏర్పాటు చేశారు. వైసీపీ ఎంపీ భరత్‌కు స్పెషల్ టాస్క్ ఇచ్చారు. ఆయనే లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జనాలను తీసుకొచ్చి మోహరింప చేశారు.
అమరావతి రైతులు రాజమండ్రిలోకి ఎంటర్ కాగానే కవ్వింపులు ప్రారంభమయ్యాయి. ఓ దశలో రైతులపైకి కుర్చీలు..వాటర్ బాటిళ్లు విసిరారు. గొడవలు.. ఘర్షణ జరగడానికి ఇది సరిపోదని అనుకున్నారేమో కానీ నేరుగా రాజమండ్రి ఎంపీ భరత్ రంగంలోకి దిగారు. రైతులపై దాడికి ఉసిగొల్పారు. దీంతో పరిస్థితి దిగజారింది. ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఎంపీ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లుగా వీడియోల్లో స్పష్టంగా ఉంది.
అమరావతి రైతులకు వ్యతిరేకంగా వైసీపీనేతలే డబ్బులు ఖర్చుపెట్టి మరీ ఉద్యమిస్తున్నారు. ప్రజా స్పందన లేకపోయినా ఉందన్నట్లుగా చూపించడానికి రౌడీ మూకల్ని ఉసిగొల్పుతున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు సైలెంట్ గా ఉంటున్నారు. పోటీ నిరసనలకు అనుమతి ఇస్తున్నారు. దాడులు జరిగితే .. వైసీపీ నేతలపై కాకుండా బాధితులపై ఎక్కువ కేసులు పెడుతున్నారు. ఇలాంటి పోలీసింగ్ ఎక్కడా చూడలేని ప్రజలు కూడా అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది.