రిపబ్లిక్ టీవీ వ్యవస్థాపకుల్లో ఒకరు.. సౌండింగ్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆర్నాబ్ గోస్వామి తనపై, తన భార్యపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆరోపణలు గుప్పించడం కలకలం రేపుతోంది. నేరుగా ఆయన సోనియా గాంధీని గురి పెట్టారు. ఆయనపై దాడిని… కొంత మంది సమర్థిస్తూ.. మరికొంత మంది వ్యతిరేకిస్తూ.. ప్రకటనలు చేయడం… రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. జర్నలిస్ట్‌గా ఆర్నాబ్ దంపతులపై దాడిని అందరూ ఖండించారు. జర్నలిస్టులపై దాడి వరకూ .. ఖండన వరకూ అన్ని పార్టీలు ఒకే బాట మీద ఉన్నాయి. అయితే.. ఆ దాడి పని కాంగ్రెస్‌దని… ఆరోపణలు ప్రారంభించడంతో… మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.
ఆర్నాబ్ గోస్వామి మొదటి నుంచి బీజేపీ సపోర్టరే.. ఆ పార్టీ భావజాలాన్ని సౌండింగ్ గా వినిపిస్తారు. అయితే.. కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీపై.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పౌరసత్వాన్ని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. మహారాష్ట్రలోని పాల్గర్ అనే గ్రామంలో వాహనంలో వెళ్తున్న సాధువులపై కొంత మంది దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా హిందూ – ముస్లిం గొడవ అన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే లాక్ డౌన్ టైంలో కరోనా భయాల కారణంగా జరిగిన ప్రచారాలతోనే వాహనంపై పాల్గర్ గ్రామస్తులు దాడి చేశారని విచారణలో తేలింది. 101మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. వీరెవరిలోనూ ముస్లింలు లేరు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అదే విషయాన్ని ప్రకటించి.. హిందూ ముస్లింల గొడవలుగా ప్రచారం చేస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అయితే.. ఈ వివాదంలోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాను తీసుకు వచ్చారు ఆర్నాబ్ గోస్వామి. ఈ ఘటనతో సోనియా సంతోషించి ఉంటారని… తన మీడియా షోలో వ్యాఖ్యానించారు. అక్కడి నుంచే వివాదం ప్రారంభయింది. ఇప్పుడు తనపై.. తన భార్యపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని చెప్పడం ద్వారా..వివాదానికి మరో రూపు తీసుకువచ్చారు. మొత్తానికి దేశంలో.. కరోనా ఔట్ బ్రేక్ కారణంగా… ప్రజలందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. కానీ రాజకీయ నేతలు మాత్రం.. వారి రక్షణ కన్నా.. ఇతర అంశాలను హైలెట్ చేసి.. తమ రాజకీయం తాము చేసుకోవడానికి ఏ మాత్రం సందేహంచడం లేదు.