వికారాబాద్ జిల్లాలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రజాభిప్రాయసేకరణ కోసం వెళ్లిన అధికారులపై దాడులు చేశారు. ఓ మహిళ నేరుగా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయడం సంచలనం సృష్టించింది. నిజానికి అక్కడ అంత పెద్ద గొడవ జరగాల్సిన అవసరం లేదు. ప్రజలు తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తే అదే రికార్డు చేసుకుని అధికారులు వెళ్తారు. బలవంతపు భూసేకరణ అనే వరకూ ఇంకా రాలేదు. కానీ అక్కడ అంతకు మించి జరిగిపోయిదంి.
రైతుల పేరుతో కొంత మంది దాడులకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కొడంగల్ అభివృద్ధి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధారిటీకి చెందిన అధికారిపై టార్గెటెడ్‌గా దాడులు చేశారు. రైతులు అయితే ఇలా చేయరని.. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే ఈ దాడులు చేశారన్న అనుమానాలు కాంగ్రెస్ లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది రాజకీయపరమైన సమావేశం కావడంతో అందరూ సైలెంట్ గా ఉన్నారు. అధికారులపై దాడులు అత్యంత తీవ్రమైనవి.
ఈ విషయంలో అధికార యంత్రాంగం.. దాడులకు పాల్పడిన వారు ఎవరు.. వాటి మోటివేషన్ ఏమిటి అన్నదానిపై ఆరా తీస్తోంది. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో సైలెంట్ గా ఉంటే.. ముందు ముందు మరింతగా రాజకీయ పార్టీల ముసుగులో కార్యకర్తలు రెచ్చిపోతారని భావిస్తున్నారు. ఈ దాడిని అంత తేలికగా వదిలే అవకాశాలు లేవని మాత్రం అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.