ఆంధ్రప్రదేశ్లో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. వారు నోరెత్తకుండా అణిచివేసేందుకు వైసీపీ నేతలు ఈ పనులు చేస్తున్నారని.. అలా దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే.. వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూ.గో జిల్లాలో సీతానగరంలో ప్రసాద్ అనే యువకుడి శిరోముండనం దగ్గర్నుంచి… మాస్క్ లేదని చీరాలలో ఓ యువకుడిని కొట్టి చంపడం… సిక్కోలులో ఓ మరో దళితుడి గుండెలపై తన్నడం.. లాంటి వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం.. ఆ తర్వాత అనంతపురంలో.. రోడ్డు పనుల్లో పాల్గొంటున్న ఓ దళిత వ్యక్తిని.. వైసీపీ నేత ఎగిరి తన్నడం వంటివి వీడియో సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. దాంతో.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఎప్పుడూ దళితులపై ఈ స్థాయిలో దాడులు జరగలేదు. దీంతో.. ఆ వర్గం ప్రజల్లోనూ ఆందోళన ప్రారంభమయింది. మరో వైపు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిరంతరం ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ నేతలను కట్టడి చేయకపోవడం.. వారేం చేసినా చర్యలుండవనే సంకేతాలు పంపడం వల్లే దళితులపై దాడులు పెరిగిపోయాయని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకుని వాటిని కట్టడి చేయాల్సిన అధికార పార్టీ… అవన్నీ చిన్న చిన్న గొడవలని.. వాటిని ప్రభుత్వానికి అంట గడుతున్నారని ఎదురుదాడి ప్రారంభించారు.
ఊళ్లలో జరిగే గొడవల్ని ప్రభుత్వానికి అంట గడుతూ.. చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటూ.. వైసీపీ నేతలు ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. అందుకు సోమవారం ముహుర్తంగా నిర్ణయించుకున్నారు వైసీపీ నేతలు. దళితులపై వరుసగా దాడులు జరుగుతూంటే.. వారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి కానీ.. అలా డిమాండ్ చేస్తున్న విపక్ష నేతకు వ్యతిరేకంగా వైసీపీ దళిత నేతలు ఆందోళనలు చేయడం.. సరికొత్త రాజకీయం.