అదానీ కంపెనీపై దాడులు చేసేంత ధైర్యం రాజకీయ నాయకులకు ఉంటుందా ?. అదీ బీజేపీ నేతలకు.. !. ఆదినారాయణరెడ్డికి అయితే ఉంటుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు అదానీకి గ్రూప్ నిర్మిస్తున్న ఓ పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టు వద్ద హంగామా చేశారు. దాడులు చేశారు. దీంతో ఈ వ్యవహారం సంచలనాత్మకం అయింది.
సాధారణంగా రాయలసీమలో ఇదే చేస్తూంటారు. అక్కడ పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయ నేతలకు డబ్బులు పర్సంటేజీలుగా చెల్లించాలి. లేకపోతే ఇలాంటిదాడులే జరుగుతాయి. గతంలో ఓ కాంట్రాక్ట్ కంపెనీని ఇలాగే బెదిరించడంతో ఆ కంపెనీ కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా జగన్ రెడ్డి బంధువును కడప నుంచి బహిష్కరణ చేశారు. తర్వాత ఆయన అక్కడకు యధావిధిగా వెళ్లేవారు అది వేరే విషయం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆ పనులు చేశారు.
కొద్ది రోజులుగా పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు వద్ద ఆదినారాయణరెడ్డి మనుషులు ఉద్రిక్తత సృష్టిస్తున్నారు. నిరాటంకంగా పనులు చేసుకోవాలంటే ఇంత అని బేరం పెట్టారు. కానీ అదానీ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో దాడులు చేసేశారు. నిజానికి ఈ బెదిరింపుల గురించి చంద్రబాబుకు సమాచారం రావడంతో ఆదినారాయణరెడ్డిని హెచ్చరించారని చెబుతున్నారు. జగన్ తీరు వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోతే ఇప్పుడు ఇలాంటివి చేస్తే ఇక సమస్యలేనని ఆయన గట్టిగా చెప్పారని అంటున్నారు. అయితే రెండు రోజుల్లోనే దాడులు జరిగాయి.
ఈ దాడుల్ని ఆదినారాయణరెడ్డి సమర్థించుకున్నారు. తమ వాళ్లు ఉద్యోగాలు అడగడానికి.. తమ లారీల్ని లీజుకు పెట్టుకోమని అడగడానికి వెళ్లారని అక్కడ వైసీపీ వాళ్లను చూసి ఆవేశానికి గురయ్యారని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు సెటిల్ చేసి.. రాయలసీమలో ఎక్కడా ఇన్వెస్టర్లను రాజకీయ నేతలు బెదిరించకుండా చేయాల్సిన వాతావరణం కల్పించాల్సి ఉంది.