జనసేన పై రాజకీయ దాడులే కాదు.. పార్టీ ఆఫీసులపై దాడులు కూడా ప్రారంభమయ్యాయి. కర్నూలులో జిల్లా కార్యాలయాన్ని గతంలో ప్రారంభించారు. గణేష్‌నగర్‌లో ప్రత్యేకంగా లీజులు తీసుకుని మరీ ఈ కార్యాలయాన్ని జనసేన నేతలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే హఠాత్తుగా జనసేన కార్యాలయం పై కొంత మంది దుండగులు దాడి చేశారు.
ఆఫీస్ లో ఉన్న వారిని బయటికి పంపి ఫర్నీచర్ బయటపడేసి తాళం వేశారు. ఆఫీసును ఖాళీ చేయాలని కొద్ది రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు జనసేన నేతల్ని బెదిరిస్తున్నారు.
జనసేన కార్యాలయం ఉన్న భవనం యజమాని కూడా ఖాళీ చేయాలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఐదేళ్లు రెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామని అద్దె కూడా చెల్లిస్తున్నామని ఒప్పందం ప్రకారం ఖాళీ చేయించడానికి లేదని జనసేన నేతలు అంటున్నారు. జనసేన ఆఫీస్ ఖాళీ చేయించేందుకు వైసీపీ నేతలు ఇదంతా చేశారని అనుమానిస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో జనసేన పార్టీ నేతలు ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు ఉద్దృతం చేస్తున్నారు.
ఎన్నికల వేడి ప్రారంభం కావడమే దీనికి కారణం. ఇప్పుడు వైసీపీ నేతలు.. కొన్ని కొన్ని జిల్లాలో అసలు జనసేనకు పార్టీ ఆఫీసులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని అద్దె భవనాల్లో ఉన్న వాటిని గుర్తించి.. యజమానులపై ఒత్తిడి తెస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం లేదు. తాము వెనక్కి తగ్గబోమని జనసేన నేతలు చెబుతున్నారు.