తెలంగాణలో రోజు రోజుకు సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవి ఏ మలుపులు తిరుగుతాయో అంచనా వేయడం కష్టంగా మారుతోంది. తాజాగా సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ అలయంలోకి చొరబడి ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహంపై దాడి చేశాడు. ఉద్దేశపూర్వకంగా ఆలయంలో ఆ వ్యక్తి అలా చేశాడని స్పష్టమవుతోంది. మొత్తం సీసీ కెమెరాల్లో నమోదయింది. తర్వతా ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సహజంగానే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి బీజేపీ నేతలు ఆలయంలోకి క్యూ కట్టారు. అందరూ ట్వీట్లు చేశారు. ఆ వీడియోను జత చేశారు. దీంతో గగ్గోలు రేగింది. అందరూ ఖండించారు. కిషన్ రెడ్డి ఆలయానికి వెళ్లి పరిశీలించారు. రాజాసింగ్ ను మాత్రం అటు వైపు పోకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు చాలా వేగంగా స్పందించి ఆలయంలో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతనెవరన్నది బయట పెట్టలేదు.
అయితే ఒకరి ఆలయాలపై మరొకరు దాడి చేయడం అన్నది ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్యేనని దీని వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు కూడా అనుమానిస్తు్న్నారు. రాజకీయ నాయకులు రెచ్చగొట్టకుండా ఉండాలని కోరుతున్నారు. ఈ విషయం రాజకీయంగా హైలెట్ అయినా అవ్వకపోయినా … తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పే ఓ ప్రయత్నం మాత్రం జరుగుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.