యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న నారా లోకేష్ పై దాడులకు పక్కా స్కెచ్ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువగళం వాలంటీర్లను అరెస్టు చేయడానికి భీమవరంలో పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేశారు. రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. ఎదురు తిరిగిన యువగళం వాలంటీర్లను వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఓ బెటాలియిన్ పోలీసుల్ని పంపి మరీ యువగళం క్యాంప్ సైట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేశారు. వారిలో దాడులకు గురైన వారు ఉన్నారు.
యువగళంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వెహికల్స్ నడపడం.. భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు… పాదయాత్రలో గందరగోళం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు వీరందర్నీ పోలీసులు అదులుకో తీసుకున్నారు. అసలు లోకేష్ పాదయాత్రపై దాడులకు పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఉద్దేశపూర్వకంగా దాడులు చేయాలని.. వాళ్లు తిరగబడతారని.. అప్పుడు కేసులు పెట్టాలన్న పక్కా సూచన మేరకే వారు సైలెంట్ గా ఉన్నారన్న విషయం స్పష్టమవుతోంది. చంద్రబాబు పర్యటనల్లో కూడా ఇదే ప్లాన్ అమలు చేశారు. చంద్రబాబుపై రాళ్లేసి..తిరగబడేసరికి.. చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు.
ఓ రౌడీ షీటర్ ఆధ్వర్యంలో కొంత మంది గంజాయికి బానిసైన వాళ్లను ఉపయోగించి దాడులు చేశారని స్పష్టంగా తెలుస్తూనే ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. కానీ వారిపై కేసులు పెట్టడం లేదు. పరిస్థితి చూస్తూంటే ఇప్పుడు వాలంటీర్లను అరెస్ట్ చేసి ఇక లోకేష్ పై దాడులకు ప్లాన్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కు ప్రాణహానీ ఉందన్న ఆందోళన టీడీపీలో వ్యక్తమవుతోంది. పోలీసులు పూర్తిగా నేరగాళ్లతో చేతులు కలిపిన వైనం.. కళ్ల ముందు కనిపిస్తూంటే. .. సొంత రక్షణ ను కూడా పోలీసులు ఇలా కుట్ర పూరితంగా అరెస్టులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.