ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా… ఎత్తేయాలని నిర్ణయించుకోవడం కలకలం రేపుతోంది. 2018 మే 15వ తేదీన గుంటూరులో విధ్వంసం జరిగింది. ఓ బాలికపై అత్యాచారం ఘటనలో పోలీసులు సరిగ్గా స్పందించలేదంటూ.. అల్లరి మూక పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగింది. ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడానికి సంఘ విద్రోహ శక్తులే కారణమని అప్పట్లో పోలీసు శాఖ నివేదికలు ఇచ్చింది. ఆందోళనకారుల్లో చొరబడిన కొందరు ప్రణాళిక ప్రకారం విధ్వంసానికి దిగినట్లు నిర్ధారించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఇప్పుడు ఆ కేసులన్నింటినీ ఉపసంహరిస్తూ… హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మొత్తం 6 కేసులను ఉపసహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏవో రాజకీయ ఆందోళనలాంటి చిన్న చిన్న కేసులు ఎత్తివేయడం ఇప్పటి వరకూ చూసి ఉంటాం కానీ.. ఇప్పుడు.. సంఘ విద్రోహశక్తులుగా గతంలో.. పోలీసులే నిర్ధారించి.. అరెస్టులు చేసిన.. వారి కేసులు మాఫీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. అదీ కూడా.. శాంతిభద్రతల్ని కాపాడాల్సిన పోలీసులపైనే దాడి చేసిన వారి కేసుల్ని విచారణ చేసి.. కోర్టులో శిక్ష పడేలా చేయాల్సిన కేసుల్ని రద్దు చేయడం… ఆశ్చర్యకరంగా మారింది.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకానేక కేసుల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంతోంది. కొన్ని హత్య కేసుల్ని కూడా ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. కాపు రిజర్వేషన్ ఉద్యమం పేరుతో… రైళ్లు తగులబెట్టి… పోలీస్ స్టేషన్లో విధ్వంసం సృష్టించి.. పోలీసులపై విరుచుకుపడిన వారి కేసులనూ ప్రభుత్వం ఎత్తివేసింది. రైళ్లు తగులబెట్టిన కేసును రైల్వే శాఖ మాత్రం ఎత్తివేయలేదు. గతంలో ఈ విధ్వంసాలకు వైసీపీ నేతలు కుట్ర పన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక… ఆ ఘటనల్లో నిందితులందరిపై కేసులు ఎత్తివేస్తున్నారు.