ఆంధ్రప్రదేశ్‌కు కల్పతరువుగా మారుతుందని అనుకున్న రాజధానిపై ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే దారుణమైన కుట్రలకు పాల్పడటం.. ఇందు కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను చివరికి న్యాయస్థానాలను సైతం లెక్క చేయకపోవడం ప్రపంచంలో ఎక్కడా జరగదేమో. ఏపీలో మాత్రం జరుగుతుంది. ఓ రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి చెందితే బాగుపడేది ప్రజలే అనే ఆలోచనను వదిలేసి.. ఆ రాజధానిని సర్వనాశనం చేయాలి.. అక్కడ భూములిచ్చిన వారిని ఆత్మహత్యలు చేసుకునేలా చేయాలన్న తపన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.
సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్ని రాజధాని అవసరాలకే కేటాయించాలి. ఇదే విషయాన్ని కోర్టు కూడా స్పష్టంచేసింది. కానీ ఇప్పుడు సీఆర్డీఏ చట్టంలో సవరణలు తీసుకు వచ్చి బయట వాళ్లకు కూడా రాజధానిలో స్థలాలిస్తామని చెబుతోంది. ఇది కోర్టులో నిలబడుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు ఇలాంటి ఆలోచనలు చేయడంలోనే ప్రభుత్వ పెద్దల కుట్ర పూరిత ఆలోచనలు బట్టబయలు అవుతున్నాయి. చేసే ప్రతీ తప్పుడు పనికిపేదలను అడ్డం పెట్టుకోవడం కామన్ అయిపోయింది. పేదలకు ఇళ్లివ్వొద్దా.. పేదలు తక్కువ ధరలకు సినిమాలు చూడొద్దా.. పేదలకు ఇంగ్లిష్ మీడియం వద్దా అంటే.. ప్రతీ దానికి పేదల్నే అడ్డం పెట్టుకుంటున్నారు.
పేదలకు మేలు చేయాలనుకుంటే చట్టాలను… రాజ్యాంగాలను ఉల్లంఘించకుండా చేయడానికి వందల కొద్దీ మార్గాలుంటాయి. ఉదాహరణకు ఇంగ్లిష్ మీడియమే తీసుకుంటే.. తెలుగు మీడియం ఎత్తివేత కోసం ఈ మార్గం ఎంచుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం అంతకు ముందు ఉంది.. ఇప్పుడూ ఉంది. ఇంకా పెంచాలనుకుంటే పెంచుకోవచ్చు. ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ పేదల పేరుతో తెలుగుమీడియం ఎత్తేసి.. పేదలు ఇంగ్లిష్ మీడియం చదవొద్దా అంటూ అతి తెలివి ప్రదర్శించేశారు. రాజధాని విషయంలోనూ అంతే.
ప్రజలకు మేలు చేయడం కాకుండా ప్రజల్ని అడ్డం పెట్టుకుని ఏదో సాధించేద్దాం అనుకున్న వారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి . అలాంటి వారి వల్ల ప్రజలకు మేలు జరగడం అసాధ్యం. చివరికి కోలుకోలేని విధంగా నష్టపోయేది రాష్ట్రం.. ప్రజలు. ప్రభుత్వ పెద్దలకు పోయేదేమీ ఉండదు. వారి లాభం వారికి ఉంటుంది. ఇప్పుడు ఏపీలో పాలకులు అదే చూసుకుంటున్నారు.