షర్మిలపై వైసీపీ నేతలు , కార్యకర్తలు, సోషల్ మీడియా చేస్తున్న దాడి జాతీయ అంశంగా మారింది. స్వయంగా రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఈ అంశంపై స్పందించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. షర్మిలకు మద్దతుగా ఉంటామన్నారు.
షర్మిల కూడా తన సోషల్ మీడియాలో స్పందించారు. ఓటమి ఎదుర్కోలేక పిరికివాళ్ళు మాత్రమే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారని మండిపడ్డారు. వారి చర్యలు దుర్మార్గంగా కూడా ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపుతున్న మద్దతు… వారి ఆప్యాయతనే మాకు బలమని.. ఈ విషయంలో మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ప్రత్యేక ధన్యవాదాలని షర్మిల ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతల కుటుంబాలపై ఎంతటి విషాన్ని చల్లారో.. ఇప్పుడు జగన్ సొంత కుటుంబసభ్యులైనా వైసీపీ సోషల్ మీడియా అదే చేస్తోంది.
వైసీపీ సోషల్ మీడియా.. షర్మిలపై.. ఆమె తల్లిపై చేస్తున్న ప్రచారం జాతీయ స్థాయిలో హైలెట్ అవుతోంది. వారిద్దరూ మహిళలు.. పైగా సొంతకుమారుడి నేతృత్వంలో ఇలాంటి దాడులు జరగడం ఢిల్లీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఇదేమి పైశాచికత్వం అనే చర్చ నడుస్తోంది. త్వరలో మరికొంత మంది మహిళా ప్రముఖులుకూడా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.