ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పుతారో వారిపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. యాధృచ్చికంగా జరిగిపోతున్నాయని.. తమకేం సంబంధం లేదని అధికార పార్టీ నేతలు చెబుతూ ఉండవచ్చు కానీ… బలంగా వాయిస్ వినిపించే వారి వ్యవహారంలో ఇలా జరుగుతూండటంతో.. అందరూ.. ” అబ్బ..ఛా” అని రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్కు వ్యతిరేకంగా.. ఆయన పాలనా తీరుకు వ్యతిరేకంగా గట్టి వాయిస్ వినిపిస్తున్న సబ్బంహరి ఇంటి గోడను.. నాలుగు వందల మందిని తీసుకు వచ్చి .. విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. విశాఖలో మిగిలిన ఆక్రమణ అదొక్కటే కాదు. కొన్ని లక్షల ఆక్రమణలు ఉన్నాయి. పైగా ఆ విషయంలో తన వద్ద పత్రాలున్నాయని సబ్బం హరి చెబుతూనే ఉన్నారు. ఆ గోడ నిర్మాణానికి సంబంధించిన రాజకీయ ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి.
కానీ హఠాత్తుగా ఓ తెల్లవారుజామున.. నోటీసు గోడకు అంటించేశామని ప్రకటించేసి.. ఆ గోడను కూల్చేశారు అధికారులు. రాత్రికి రాత్రి సాగిపోయిన ఈ వ్యవహారం అచ్చంగా ఫ్యాక్షన్ ప్రణాళికలా ఉందన్న విమర్శలు వచ్చాయి. దీనిపై రచ్చ సాగుతూండగానే.. విజయవాడలో మరో టీడీపీ నేత పట్టాభిపై దాడి జరిగింది. పట్టాభికి చెందిన కారుపై అర్థరాత్రి దుండగులు దాడి చేశారు. పెద్ద పెద్దరాళ్లతో అద్దాలను ధ్వంసం చేసి వెళ్లారు. పట్టాభి ఇటీవలి కాలంలో టీడీపీ అధికార ప్రతినిధిగా వైసీపీపై అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఘాటుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంబులెన్స్ స్కాం విషయంలో గతంలో ఆయన చేసిన ఆరోపణల విషయంలో ఆయనను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలొచ్చాయి.. ఆయనఇంటి ముందు మోహరించి.. చివరికి వెనక్కి తగ్గారు. అప్పటి నుండి ఆయనను సైలెంట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ నడుస్తోంది.
ఇప్పుడు ఆయన కారుపై దాడి చేయడంతో.. ఆ కోరణంలోనే సాగిందనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయగానే పోలీసులు హుటాహుటిన వచ్చి… పగిలిపోయిన అద్దం కొలతలు.. ఏ రాళ్లు పెట్టి పగలకొట్టారో ఆ రాళ్ల కొలతలు తీసుకుని వెళ్లారు. చివరికి వారు చిత్తూరు తరహాలో ఎవరినో పట్టుకుని వారు టీడీపీ వాళ్లేనని చెప్పడం తప్ప ఇంకేం చేయరని టీడీపీ నేతలు సహజంగానే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. టీడీపీ నేతలను సైలెన్స్ చేయించడమే లక్ష్యంగా… అధికార పార్టీ నేతల స్పాన్సర్షిప్తోనే ఇవన్నీ జరుగుతన్నాయన్న అనుమానాలు అంతకంతకూ బలపడుతున్నాయి. ఏపీలో ఉన్నది ఫ్యాక్షన్ ప్రభుత్వమని ఇవే సాక్ష్యాలని టీడీపీ నేతలని విమర్శలు గుప్పిస్తున్నారు.