ఓ ఫేక్ పోస్ట్ మొదట ఎవరు పోస్టు చేశారో తెలుసుకోవడం.. క్షణాల్లో పని. సిస్టం ఐడీని తెలుసుకుని .. దానికి సంబంధించిన వార్ని పట్టుకోవచ్చు. అంతే కానీ.. ఏపీ సీఐడీ పోలీసులు అసలు క్రియేట్ చేసిన వార్ని వదిలేసి.. షేర్ చేశారంటూ టీడీపీ నేతల్ని వెంటాడుతున్నారు. చివరికి గౌతు శిరీషకూ అర్థరాత్రి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ లోగోతో అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దయ్యాయని ఓ పత్రికా ప్రకటన వచ్చింది. అది టీడీపీ నేతల్ని ఇరికించడానికి వ్యూహాత్మకంగా కొందరు అధికార పార్టీ వారే క్రియేట్ చేసి లీక్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదేదో బాగుందని షేర్ చేసి టీడీపీ నేతలు బుక్కయ్యారు. దానికి తగ్గట్లుగానే క్రియేట్ చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడం లేదు. షేర్ చేసిన టీడీపీ నేతల్ని మాత్రం వెంటాడుతున్నారు.
నిజానికి అసలు టీడీపీ ఫేక్ పోస్టుల బాధిత పార్టీగా మారింది. దివ్యవాణి ఇలాంటి ఫేక్ పోస్టు కారణంగానే పార్టీకి దూరమైంది. వర్ల రామయ్యతో పాటు అనేక మందిపై ఇలాంటి ఫేక్ పోస్టులతో దాడి చేస్తున్నారు. చంద్రబాబు సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తున్నారు. చివరికి లోకేష్ పర్యటన కోసం 2017లో టెన్త్ ఫలితాలు ఆపారన్న తప్పుడు పోస్టులను కూడా క్రియేట్ చేశారు. కొన్ని వందల ఫేక్ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇదంతా వ్యవస్థీకృతంగా జరిగిపోతోంది. ఎక్కడ క్రియేట్ అవుతున్నాయో కనిపెట్టడం పెద్ద విషయం కాదు. రాజకీయవర్గాల్లో అందరికీ తెలుసు.
టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గతంలో గౌతు శిరీషపై అసభ్యకరంగా మాట్లాడిన వారిపై.. పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఆమె ఓ పోస్టు షేర్ చేశారని నోటీసులు పట్టుకుని వచ్చేశారు. ఫేక్ పోస్టులతో టీడీపీపై దాడి చేస్తూ.. అదే ఫేక్ పోస్టుల పేరుతో టీడీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని.. ఖచ్చితంగా దీనికి ప్రతి చర్య ఉంటుందని టీడీపీ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు.