బీజేపీని ఎదుర్కోవడం ఎలా..?.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో ఏకైక ఎజెండా ఇదేనని.. వైసీపీ, టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. కేంద్రంలో అధికారం అండతో.. రాష్ట్రాల్లో తమ విధానపరమైన నిర్ణయాలనూ.. బీజేపీ అడ్డుకుంటోందని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో.. కేంద్రం వద్దకు ఉమ్మడిగా వెళ్లి డిమాండ్లు నెరవేర్చుకోవాలని లేకపోతే.. తగిన రాజకీయ కార్యచరణ సిద్ధం చేసుకోవాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అధికారిక సమావేశం కాదు.. ఫ్రెండ్లీ మీటింగే..!?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అని కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీని కోసం అధికారులు ఎజెండా రెడీ చేశారని .. గతంలో ప్రగతి భవన్ సమావేశంలో జరిగిననట్లుగా.. రెండు రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొని.. అన్ని వివరాలు ముఖ్యమంత్రులకు తెలియజేసి.. విధాన నిర్ణయాలకు ముందడుగు వేస్తారని అనుకున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్న అధికారుల్లో ఒక్కరంటే.. ఒక్కరు కూడా ప్రగతిభవన్‌లో కనిపించలేదు. ఎలాంటి అధికారిక నివేదికల ప్రస్తావన రాలేదు. జగన్ తో పాటు వైవీసుబ్బారెడ్డి, వేమిరెడ్డి లాంటి వాళ్లు మాత్రమే ఉన్నారు. వారితో కలసి బ్రహ్మోత్సవాలు.. ఇతర అంశాలపై చర్చించారు. తర్వాత జగన్ – కేసీఆర్ ముఖాముఖి.. రెండు, మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇది అధికారికంగా కాకుండా.. కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ లాంటిదేనని…అధికారవర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ దూకుడును తగ్గించడమే లక్ష్యంగా చర్చలు..!?
బీజేపీ ఇప్పుడు… రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు సవాల్‌గా మారుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. గతంలో లైట్ తీసుకున్నా ఇప్పుడు బీజేపీని తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి కేసీఆర్‌కు ఉంది. పైగా తెలంగాణ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. కేంద్రం సాయం చేయడం లేదనే ఆగ్రహం ఉంది. అదే సమయంలో.. విధానపరమైన నిర్ణయాల్లోనూ సహకరించడం లేదని కేసీఆర్ చెబుతున్నారు. ఏపీలోనూ దూకుడు చూపిస్తున్న బీజేపీని ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డికి సమస్యగా మారింది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఢిల్లీలో ఏ పనికీ గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. పోలవరం రివర్స్ టెండరింగ్ కు అనుమతించడం లేదు. చివరికీ అధికారుల బదిలీలకూ అంగీకరించలేదు. అందుకే బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కోవడానికి వ్యూహాలు అమలు చేయబోతున్నారని.. ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులకు కేంద్రమే కారణమని.. ప్రచారం చేయడానికి కావాల్సిన గ్రౌండ్ ను రెడీ చేసుకున్నారు. అయితే.. వైసీపీకి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత స్కోప్ లేదు. అందుకే.. కేసీఆర్ మీదనే ఆధారపడి జగన్ .. బీజేపీని ఎదుర్కొనే రాజకీయ వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీకి రావాల్సిన వాటిపై ఒక్క మాట కూడా చర్చించలేదా..?
విభజన సమస్యల పరిష్కారం కోసం.. ఏపీ ప్రభుత్వం సరిగ్గా ప్రయత్నించడం లేదనే విమర్శలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, విద్యుత్ బకాయిలు సహా.. పలు వివాదాలను పరిష్కరించేందుకు.. ముఖ్యమంత్రి చొరవ చూపించలేకపోయారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. హైదరాబాద్ లో ఉన్న ఏపీ భవనాలను.. తెలంగాణ సర్కార్ కు ఇచ్చేసిన.. జగన్.. ప్రతిఫలంగా.. ఒక్కటంటే.. ఒక్క వివాదాన్నీ సానుకూలంగా పరిష్కరించుకోలేకపోయారు. ఇప్పటి సమావేశం తర్వాత కూడా క్లారిటీ రాలేదు.