మహిళా దినోత్సవం రోజునా అమరావతి మహిళా రైతులకు ఎలాంటి గౌరవం లభించలేదు సరి కదా.. పోలీసులు చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఓ వైపు మహిళలకు అండగా నిలబడతామని పెద్ద పెద్ద ప్రకటనలు పాలకులు చేస్తూండగానే… మరో వైపు పోలీసులు మహిళల జుట్టుపట్టుకుని కొట్టడం ప్రారంభించారు. అమరావతి మహిళలు ఈ రోజు… దుర్గమ్మ దర్శనానికి వెళ్లి.,. ప్రత్యేక పూజలు చేయాలనుకున్నారు. ర్యాలీగా ప్రకాశం బ్యాలేజీ వద్దకు వెళ్లే సరికి పోలీసులు అడ్డుకున్నారు. అడుగు ముందుకు వేయనీయలేదు. దాంతో తోపులాట చోటు చేసుకుంది. బలవంతంగా పోలీసులు జుట్టు పట్టుకుని మరీ పోలీస్ వ్యాన్లలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు.
మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం గురించితెలిసి.. ఇతర రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సిస్ రోడ్డుపై సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. పలు గ్రామాల నుంచి రైతులు ర్యాలీగా బయలుదేరేందుకు సిద్దం కావడంతో గ్రామాల మధ్య ముళ్ల కంచెలు అడ్డం వేసి వారిని నిలువరించారు. కొంత మంది రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మహిళా రైతులపై పోలీసుల దాష్టీకం మీడియాలో..సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వైపు మహిళల గురించి గొప్పగా చెబుతూ.. మరో వైపు ఇలా పోలీసుల చేత దౌర్జన్యం చేయించడం ఏమిటన్న చర్చ జరిగుతోంది.
మహిళలు శాంతియుత ప్రదర్శనలే చేస్తున్నారు. వారిని అంత బలవంతంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటన్నది ఎవరికీ అర్థం కాని విషయం. అమరావతి మహిళా రైతుల పట్ల.. కఠినంగా వ్యవహరించాలని.. ఆదేశాలున్నాయేమోనని… రాజధాని రైతులు అంటున్నారు. పధ్నాలుగు నెలల నుంచి అదే పనిగా పోరాటం చేస్తున్నా.. ఉద్యమాలు చేస్తున్న .. ప్రభుత్వం అణిచివేత చర్యలకే పాల్పడింది కానీ.. వారి సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.