నిరంతర నిఘా, ప్రత్యేక బృందంతో భద్రత… అయినా, సీఎం జగన్ పై దుండగుల దాడి జరిగింది. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శనివారం రాత్రి జగన్ పర్యటన సాగుతుండగా… పూలతో పాటే ఓ రాయి జగన్ కు పై విసిరారు. ఆ రాయి సీఎం జగన్ కంటి పై భాగంలో తగలటంతో సీఎంకు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు రెండు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. పెద్దగాయం ఏమీ కాకపోయినా వాపు ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు.
రాష్ట్రంలో అత్యున్నత ప్రోటోకాల్ ఉండే సీఎం వస్తున్నారంటే అన్ని విభాగాలు అలర్ట్ గా ఉంటాయి. అలాంటిది సీఎం పర్యటన సందర్భంగా విద్యుత్ లేకపోవటం, దాడి జరిగాక పోలీసులు దుండగులను పట్టుకునేందుకు వేగంగా స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.
పైగా విద్యుత్ సరఫరా లేని సమయంలో చిమ్మ చీకట్లలో సీఎంను బస్సుపైకి ఎలా అనుమతిచ్చారని సెక్యూరిటీ విభాగంలో అనుభవం ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీతో పాటు ప్రతిపక్షనేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దాడిని ఖండిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కోడికత్తి డ్రామా 2.0
అయితే, ఇది మరో కోడి కత్తి డ్రామా అని, గత ఎన్నికల ముందుకు కోడికత్తి ఇప్పుడు ఈ గులకరాయి దాడి అంటూ ప్రతిపక్ష నేతలు కామెంట్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు దాడి అని వైసీపీ ప్రచారం చేసుకోవటం ఏంటీ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించగా, సానుభూతి కోసమే అంటూ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
అయితే, కంటి పైభాగంలో గాయంతో ఆదివారం జగన్ తన బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.