రైతుల ఉద్యమాన్ని పదే పదే కించ పరిస్తే… వారు ఎప్పటిలా భూమిలా సహనంతో ఉండరని.. అవమానాలను భరించరని.. అప్పుడప్పుడు హెచ్చరికలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్‌లో రైతుల అసహనం చెందితే ఏ స్థాయి ఘటనలు జరుగుతాయో… వెల్లడయింది. వ్యవసాయ చట్టాలను సమర్థిస్తూ.. రైతు ఉద్యమాలను కించ పరుస్తూ.. ప్రెస్మీట్లో అనర్ఘళంగా ప్రసంగిస్తున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేపై పంజాబ్‌లో రైతులు తిరగబడ్డారు. ముక్తసర్ జిల్లాలోని మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను రైతులు కొట్టారు. బట్టలన్నీ చింపేశారు. కొట్టుకుంటూ రోడ్డుపై పరుగులు పెట్టించారు. పోలీసులు కూడా అచేతనంగా ఉండిపోయారు. అతి కష్టం మీద ఆయనను రక్షించి… ఆస్పత్రికి తరలించార.ు
అరుణ్ నారంగ్ బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి..రైతు చట్టాలకు అనుకూలం. అయితే దేశంలో ఎక్కడా లేనంత వ్యతిరేకత రైతు చట్టాలపై బీజేపీలో ఉంది. అయినప్పటికీ.. ఆయన రైతు చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. మాట్లాడటమే కాదు.. రైతు ల ఉద్యమాన్ని కించ పరుస్తున్నారు. దీంతో తన నియోజకవర్గంలో తక్కువగానే తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన తన నియోజకవర్గానికి వచ్చారని.. రైతు చట్టాలకు మద్దతుగా మీడియా సమావేశం పెట్టబోతున్నారన్న సమాచారం రైతు సంఘాలకు అందడంతో మాలోట్లోని బీజేపీ కార్యాలయాన్నిముట్టడించారు. పోలీసులు ఆయనను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. రైతుల చేతికి ఆయన చిక్కారు. రైతులు బీజేపీ కార్యాలయంపై దాడికి దిగి నిప్పంటించారు.
గత నవంబర్ నెలలో కూడా అరుణ్ నారంగ్‌ను రైతులు ముట్టడించి కదలకుండా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. రైతులు బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఇతర సీనియర్ నేతలను ఘెరావ్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అప్పట్లో ఓయూకు వెళ్లిన నాగంపై ఇలాగే దాడి చేశారు. అయితే అంత కంటే ఎక్కువగా బట్టలు చింపేసి మరీ బీజేపీ ఎమ్మెల్యేను కొట్టారు. ఢిల్లీ శివార్లలో రైతులు ఎక్కడా కంట్రోల్ తప్పకుండా… సహనంతో పోరాటం చేస్తున్నారు.కానీ.. పంజాబ్‌లో మాత్రం పరిస్థితి మారుతోంది.