చిత్తూరు జిల్లాలో దళిత జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి వివాదం రాజకీయంగా కలకలం రేపుతోంది. జడ్జి రామకృష్ణ కుటుంబంపై చాలా కాలంగా అనేక రకాల వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ఓ సందర్భంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. విజయవాడలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అధికారపార్టీ నేతల దాడులకు గురైన వారి సమావేశం జరిగింది. అందులో రామకృష్ణ పాల్గొన్నారు. ఆ తర్వాతి రోజే.. జడ్జి రామకృష్ణ సోదరుడిపై చిత్తూరుజిల్లాలో హత్యాయత్నం జరిగింది. దీనిపై దళిత సంఘాలన్నీ భగ్గుమన్నాయి. వైసీపీ గూండాల పనేనని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అయితే పోలీసులు అనూహ్యంగా నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి అని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. నిందితుడితో కూడా అదే చెప్పించారు. జడ్జి సోదరుడు రామచంద్ర, ప్రతాప్‌రెడ్డి పరస్పరం దాడికి పాల్పడ్డారని.. ప్రతాప్‌రెడ్డి టీడీపీకి చెందిన వారే ఎస్పీ సెంథిల్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇనుప రాడ్లు వాడినట్లు సీసీ ఫుటేజీలోఎక్కడా లేదని .. చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలోని అంశాలను విచారించామని కూడా ఎస్పీ చెప్పుకొచ్చారు. ఎస్పీ సమక్షంలో మీడియాతో మాట్లాడిన నిందితుడు ప్రతాపరెడ్డి .. తన తల్లి టీడీపీ తరపున ఎంపీటీసీగా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిందని చెప్పుకొచ్చారు. ఎస్పీ సమక్షంలోనే జడ్జిపై ఆరోపణలుచేశారు.
జడ్జి రామకృష్ణ సంఘవిద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పోలీసుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతూంటే.. నిందితుల్ని తీసుకొచ్చి… ఫలానా పార్టీ వారంటూ.. చెప్పించడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. గతంలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి విషయంలోనూ… చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి.. పోలీసులు విమర్శల పాలయ్యారు. ఇప్పుడు నిందితుడితో టీడీపీకి చెందినవ్యక్తినని చెప్పించి.. కొద్ది రోజుల కిందట.. పోలీసుల బెదిరిపులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రుజువయ్యాయని టీడీపీ నేతలంటున్నారు.