మహానాడులో చంద్రబాబునాయుడు పూర్తిగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి కాదు. అయినా చంద్రబాబు బీజేపీని చాలా సీరియస్‌గా టార్గెట్ చేశారు. చంద్రబాబు రాజకీయంగా పూర్తి లెక్కలతోనే ఏ పని అయినా చేస్తారు. 2012 కి ముందు చంద్రబాబు రాజకీయంగా చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు. కానీ 2014లో చంద్రబాబు విజయం సాధించారు. దీనికి ముఖ్య కారణం రాష్ట్ర విభజన. సీమాంధ్ర ప్రజల్లో రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. వారు అలా వ్యతిరేకించడానికి కారణం హైదరాబాద్ కోల్పోతున్నామన్న భావనే. కచ్చితంగా చంద్రబాబు దీన్నే పట్టుకున్నారు. హైదరాబాద్‌ను కోల్పోయినా… అంతకు మించిన రాజధానిని నవ్యాంధ్రలో నిర్మిస్తామన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.
హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి చంద్రబాబే కారణం. హైదరాబాద్ ఆధునిక, ఆర్థిక వృద్ధిని చంద్రబాబే సాధించి పెట్టారు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్ర విభజనతో …ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగింది మాత్రం నిజమే. కానీ ఆ నష్టాన్ని అన్ని పార్టీలు మరింత తీవ్రంగా చూపించాయి. విభజనతో ఏపీ కట్టుబట్టలతో మిగిలిపోయిందని ప్రచారం చేశాయి. దీన్ని చంద్రబాబు ప్రభావవంతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తాను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. తాను అయితేనే ఏపీని నిలబెట్టగలనని నమ్మకాన్ని తెచ్చారు. దాంతో అధికారాన్ని అందుకోగలిగారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే మాటలు చెబుతూ వెళితే ప్రజలు అంగీకరించరు. అయితే ఇదే సమయంలో చంద్రబాబుకు .. నరేంద్రమోదీ ప్రభుత్వం చూపించిన నిరాదరణ కలసి వచ్చింది. దీన్నే కారణంగా చూపి ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏకైక ఏజెండా .. ఏపీకి జరిగిన అన్యాయమే.
2014 కి ముందు తిరుగులేని విధంగా విజయం ఖాయమనుకున్న జగన్ చాలా తప్పులు చేశారు. విభజన అనంతర పరిస్థితులను ఎఫెక్టివ్‌గా వాడుకోలేకపోయారు. రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే..కేంద్రం సాయం కావాలన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. అప్పటికే మోదీ గెలవడం ఖాయమన్న అంచనాలున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇది టీడీపీకి కలసి వచ్చింది. ఈ విషయంలోనూ జగన్ తప్పు చేశారు. విన్నింగ్ కాంబినేషన్లో ఉండకుండా తప్పటడుగు వేశారు. ఇప్పుడు దేశ రాజకీయాలు బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నారు. ముందు నుంచీ బీజేపీని జగన్మోహన్ రెడ్డి… పవర్‌ఫుల్‌గా టార్గెట్ చేసి ఉంటే… ప్రస్తుతం చంద్రబాబుకు ఈ అవకాశం ఉండేది కాదు. కానీ వివిధ కారణాలతో జగన్.. బీజేపీని, మోదీని టార్గెట్ చేయలేకపోయారు. దీన్ని చంద్రబాబు సమర్థవంతంగా వాడుకుంటున్నారు.
మహానాడులో ఈ కారణంగానే… బీజేపీని టార్గెట్ చేశారు. 2014కి ముందు కాంగ్రెస్… 2019కి ముందు బీజేపీని టార్గెట్ గా చంద్రబాబు పెట్టుకున్నారు. విభజన చేసినందుకు కాంగ్రెస్ పై ప్రజల్లో ఎంత కోపం ఉందో… ప్రత్యేకహోదా ఇవ్వనందుకు బీజేపీపై కూడా అంత కోపం ఉంది. కానీ ఏపీలో బీజేపీ లేదు. అయినా … చంద్రబాబు బీజేపీనే టార్గెట్ పెట్టుకోవడానికి స్పష్టమైన వ్యూహం ఉంది. ఇప్పటికీ… కేంద్రం మద్దతు లేకపోతే.. ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులకు గురవుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే కేంద్రంతో గొడవలు పెట్టుకుని..ఏపీకి ఏ సాయం లేకుండా పోతే ఎలా అనే ఆలోచన ప్రజల్లోకి రాకుండా… చంద్రబాబు తెలివిగా జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని… పదే పదే చెప్పుకొచ్చారు. అందువల్ల బీజేపీని విలన్ గా చూపించడం.. బీజేపీపై ప్రజల కోపాన్ని …తన బలంగా మార్చుకోవడం.. కేంద్రంలో ఓ శక్తిగా మారుతున్నామని.. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి మహానాడులో.. బీజేపీని చంద్రబాబు టార్గెట్ చేశారు.
ప్రస్తుతం బీజేపీపై చాలా వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీలో వైసీపీకి ప్రధానమైన ఓటు బ్యాంక్.. రెడ్డి, దళితులు, మైనార్టీలు. అరవై నుంచి ఎనభై శాతం ఈ వర్గాల ఓటర్లు వైసీపీకి ఓటు వేస్తారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడటం వల్ల దళితులు, మైనారిటీలను చంద్రబాబు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో జగన్ బీజేపీకి అనుకూలంగా ఉండటాన్ని కూడా..చంద్రబాబు ప్లస్ చేసుకుంటున్నారు. అందుకే యాంటీ మోదీ విధానాన్ని చాలా తీవ్రంగా అనుసరిస్తున్నారు. చంద్రబాబు వ్యూహం ఫలిచాలంటే.. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక ఫలితాలు ఉండాలి. చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందో…లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితులను మాత్రం .. చంద్రబాబు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు. 2014 ముందు కాంగ్రెస్ వ్యతిరేక… 2019కి ముందు మోదీ వ్యతిరేక విధాన వ్యూహంతో… చంద్రబాబు రాజకీయ చాణక్యం ప్రదర్శిస్తున్నారు.