ఆంధ్రప్రదేశ్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకేనంటూ.. ఏపీ సర్కార్ చేసిన చట్టం.. కర్ణాటకలో సెగలు రేపుతోంది. కర్ణాటకలనూ అలాంటి నిర్ణయాలే అమలు చేయాలంటూ..కన్నడ సంఘాలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ పలు చోట్ల ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా.. ఆంధ్రాకు చెందిన బస్సులు.. ఇతర వాహనాలు కనిపించిన చోట.. కన్నడ ఉద్యమకారులు రాళ్లు రువ్వారు. మంగళూరు సమీపంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరే్షన్ కు చెందిన బస్సుపై దుండగులు రాళ్లు రువ్వారు. ఇందులో.. ఏపీ నుంచి విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులు ఉన్నారు. ఈ ఘటనతో వారంతా భయాందోళనలకు గురయ్యారు. కర్ణాటక నుంచి తిరుపతికి వస్తున్న మరో బస్సుపైనా… ఈ తరహా దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది.
దాదాపు వందకుపైగా ఉన్న కన్నడ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. కర్ణాటకలో… 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తూ తక్షణం చట్టం చేయాలని వారి డిమాండ్. ఏపీలో ఈ తరహా చట్టం చేసిన తర్వాత కర్ణాటకలోనూ.. చర్చనీయాంశం అయింది. పొరుగు రాష్ట్రం వాళ్ల వాళ్లకే ఉద్యోగాలని చట్టం చేస్తే.. కర్ణాటకలో మాత్రం.. ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో.. లోకల్స్కే ఉద్యోగాలివ్వాలన్న నిబంధన లేదు. జగన్మోహన్ రెడ్డి చట్టం చేసిన తర్వాత ఏపీలోనూ.. అది ఎన్నికల అస్త్రం అయింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. ఈ చట్టం తీసుకొస్తామని స్థానికులకే ఉద్యోగాలిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు.
కన్నడ సంఘాల ఆక్రోశం.. ప్రధానంగా తెలుగువారిపైనే కనిపిస్తోంది. ఆంధ్రకు చెందిన బస్సులు, వాహనాలు కనిపిస్తే దాడులు చేయడమే దీనికి నిదర్శనం. కర్ణాటక సరిహద్దున ఉన్న ఏపీ జిల్లాలల్లో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కర్ణాటక యువత ఉపాధి కోసం వస్తున్నారు. కియా పరిశ్రమతో పాటు.. వివిధ రకాల పరిశ్రమలు రావడంతో.. వారి వలస ఎక్కువగా ఉంది. తమకు అవకాశాలు లేకుండా చేస్తున్నారని.. తమ దగ్గర మాత్రం వారికి అవకాశాలు ఎందుకివ్వాలన్న భావన పెరుగుతోదంది. ఆ ఫలితమే.. ఆంధ్రులపై.. దాడులని అంటున్నారు.