హైదరాబాద్ జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఉన్న టీవీ5 ప్రధాన కార్యాలయంపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. సెక్యూరిటీ రూమ్ అద్దాలను ధ్వంసం చేసి.. పారిపోయారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించన తర్వాత కుట్రపూరితంగా.. ఉద్దేశపూర్వకంగా చేసిందని నిర్ధారణకు వచ్చిన టీవీ5 యాజమాన్యం.. దాడి విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేయడం ప్రారంభించింది.
న్యూస్ చానల్స్‌లో ఇటీవలి కాలంలో టీవీ5 ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రసారం చేయడంలో దూకుడుగా ఉంది. గతంలో ఏబీఎన్ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు వేయడంలో ముందు ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఆ స్థానాన్ని టీవీ5 ఆక్రమిస్తోంది. కేసులు, బెదిరింపులను కూడా తట్టుకుని దూకుడుగా వెళ్తోంది. ఈ కారణంగానే వైసీపీ.. టీవీ5ను బహిష్కరించింది కూడా. అయినప్పటికీ.. టీవీ5 వెనక్కి తగ్గడం లేదు. ఆ చానల్లో చర్చా కార్యక్రమాలు నిర్వహించే మూర్తిని కూడా కొద్ది రోజల కిందట… టార్గెట్ చేశారని చెప్పుకున్నారు. అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను పంపారని కూడా ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో వెనుకడుగు వేసినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వంపై దూకుడుగా వ్యతిరేక కథనాలు ఇస్తున్న సమయంలో.. వైసీపీ నేతల నుంచి.. అదే పనిగా హెచ్చరికలు వస్తున్న తరుణంలో ఇలాంటి దాడి జరగడంతో సహజంగానే ఇది వైసీపీ నేతల పనేనన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేతలు.. తక్షణంమ ఈ దాడిని ఖండించి.. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అనేక రకాలుగా చేసిన ఒత్తిళ్లు ఫలించకపోవడంతోనే దాడులకు తెగబడుతున్నారని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరు దాడి చేశారు.. కారణం ఏమిటనేది.. పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.
Unidentified men attack @tv5newsnow building in the midnight pic.twitter.com/Fd5OQnDeVw
— TV5 News (@tv5newsnow) May 9, 2020