ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూడటం… మంత్రుల రియాక్షన్ తో విస్తృతంగా చర్చల్లోకి వస్తూండటంతో… వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడానికి వైసీపీలోని అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఘటన జరిగి నాలుగు రోజులు అయిన తర్వాత.. ఆరేడుకేసులు పెట్టి వందల మందిని అరెస్ట్ చేసిన తర్వాత కొత్తగా… ఉమాపతి రెడ్డి అనే వ్యక్తితో ఫిర్యాదు చేయించుకుని ఓ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబును ఏ వన్ గా పెట్టి హత్యాయత్నం కేసు రిజిస్టర్ చేశారు. ఎనిమిదో తేదీన ఈకేసు పెట్టినట్లుగా ఎఫ్ఐఆర్లు తొమ్మిదో తేదీన మీడియాకు లీక్ చేశారు.
తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్లో నాలుగో తేదీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ 1గానూ.. దేవినేని ఉమాపై ఏ 2గా కేసులు నమోదు చేసినట్లుగా ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.. పీలేరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు.. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి గంట నరహరితో పాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు చంద్రబాబుపై హత్యాయత్నం, కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 307 హత్యాయత్నం, 120 B నేరపూరిత కుట్ర చట్టాలు కింద కేసు నమోదు చేశారు.
అసలు చేసింది చంద్రబాబుపై హత్యాయత్నం . రాళ్లతో ఆయనపై దాడి చేశారు. బ్లాక్ క్యాట్ కమెండోలు రక్షణగా నిలబడ్డారు. కానీ.. చంద్రబాబుపైనే రివర్స్ కేసు పెట్టారు. అదీ కూడా నాలుగు రోజుల తర్వాత పార్టీ నేతలందరి పేర్లు చేర్చడంతో ఇందులో కుట్ర స్పష్టమవుతోందని టీడీపీ నేతలంటున్నారు. చిరంజీవి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు మరింతగా చర్చల్లోకి వెళ్లకుండా.. ఇలాంటి కుట్రపూరిత కేసులకు తెగబడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం మొదటి నుంచి ఇదే చేస్తోందని కొత్తేమీ లేదని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.