మీడియాపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి జరిగిన తర్వాత ఆయనపై కేసు నమోదు అయింది కానీ అది హత్యాయత్నం కేసు కాదు. కానీ ఒక రోజు తర్వాత ఆయన పోలీసుల నోటీసులకు స్పందించకుండా కోర్టుకెళ్లడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రిపోర్టర్ పై దాడి ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా స్పష్టంగా దృశ్యాలు ఉండటంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది.
మరో వైపు దాడిని సమర్థించుకునేలా మంచు విష్ణు మాట్లాడారు. ఆయన క్షమాపణలు చెప్పరన్నట్లుగా మాట్లాడారు. దీంతో మీడియా ప్రతినిధులు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు నివాసంలోకి వెళ్లినా దాడిచేయడం నేరమే అవుతుంది. అది కూడా బలమైన గాయాలు తగిలేలా కొట్టడంతో హత్యాయత్నం కేసు పెట్టాలన్న డిమాండ్ బలంగా వచ్చింది. దీంతో భారతీయ న్యాయసంహిత 109 సెక్షన్ కింద మోహన్‌బాబుపై కేసు పెట్టారు. ఇప్పటికే ఉన్న 118 సెక్షన్ కింద ఇది అదనం.
హత్యాయత్నం సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయవచ్చు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిపోయారు. ఇప్పుడల్లా డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేదు. ఇల్లు కన్నా ఆస్పత్రి పదిలం అనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైద్యులు కూడా మూడు, నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండాలని చెబుతున్నారు. అయితే ఎన్నిరోజులు ఆస్పత్రిలో ఉన్నా మోహన్ బాబుకు మాత్రం ఈ హత్యాయత్నం కేసు చిక్కులు తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.