ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో ఉదయం తొమ్మిది గంటల కల్లా స్కూల్‌కు వెళ్లి సెల్ఫీ దిగి.. తాము స్కూల్‌కు వచ్చాం అని నిరూపిస్తేనే అటెండెన్స్ వేస్తారు . ఒక్క నిమిషం లేటయినా ఆబ్సెంటే. అటెండెన్స్ అలా వేయించుకుంటాం కానీ.. ఆ యాప్ మా ఫోన్లలో ఎందుకు మీరే ఇవ్వండని..టీచర్లు అడుగుతున్నారు.
చాలా ఖర్చవుతుందని.. తాము ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. అంతే కాదు.. ఈ బాధలు మీకే కాదు.. ఉద్యోగులందరికీ ఉంటాయని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ యాప్ త్వరలో అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగులందరూ త్వరలో ఈ ఫేస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోక తప్పదు. తమపై నిఘా పెడుతున్నారేమోనని ఉద్యోగులు ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఈ యాప్ గోలతో మరింత అసహనానికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ యాప్‌పై జనసేన పార్టీ కూడా స్పందించింది . ఉద్యోగులకే ఎందుకు.. రాజకీయ నాయకులకూ ఈ యాప్ పెట్టాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. వారిని ట్రాక్ చేయవద్దా అని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను ట్రాక్చేయాల్సి ఉందని ఆయనంటున్నారు. కానీ వారు మాత్రం సీక్రెట్ వ్యవహారాలు నడపవచ్చు కానీ.. టీచర్లు మాత్రం రూల్స్ పాటించాల్సిందే.