కోవిడ్ తర్వాత సినిమా కంటెంట్ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకులు వరల్డ్ సినిమాకి అలవాటు పడటం వలన రొటీన్ మాస్ సినిమాలకి రోజులు చెల్లిపోయాయనే అభిప్రాయం వ్యక్తమైయింది. ఇందులో వాస్తవం కూడా వుంది. దర్శకులు, కథానాయకుల్లో ఆ మార్పుని అందుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి. కంటెంట్ వున్న కథలు, సినిమాల వైపు అడుగులు పడ్డాయి. అయితే సడన్ పరిస్థితి మారింది. మళ్ళీ రొటీన్ మాస్ మసాలా సినిమాలకి ప్రేక్షకులు ఆదరించడం కనిపించింది. రవితేజ ‘ధమాకా’ సినిమా దీనికి నిదర్శనంగా నిలిచింది.
కథ పరంగా ఎలాంటి కొత్తదనం లేని సినిమా ధమాకా. విమర్శకులంతా పెదవి విరిచారు. ప్రేక్షకులు కూడా ఇందులో పాటలు ఫైట్లు తప్పా ఏమీ లేవని అభిప్రాయపడ్డారు. విశేషం ఏమిటంటే.. ఆ పాటలు, ఫైట్లు చూడటానికే జనం ఎగబట్టారు. దీంతో వందకోట్ల సినిమాగా ధమాకా అవతరించింది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి కూడా రొటీన్ మాస్ సినిమానే. ఇప్పటికే ఇలాంటి టెంప్లెట్ కథలు బాలయ్యే బోలెడు చేశారు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ మరీ పంక్తు కమర్షియల్ మాస్ మసాలా సినిమా. అయితే ఈ రెండు సినిమాలని ప్రేక్షకులుచక్కగా ఆదరించారు. ఫ్యాన్స్, థియేటర్ వచ్చి సినిమా చూసే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. సంక్రాంతి సీజన్ కూడా ఈ రెండు సినిమాలకి కలిసొచ్చింది. ఈ రెండు సినిమాల విజయాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. రొటీన్ కథలో అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరిస్తే ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉంటారని నిరూపించాయి.
అయితే ఇలా రొటీన్ కథలు తీయడం కూడా ఒక సవాల్ తో కూడుకున్నదే. పాటలు సినిమా విడుదలకు ముందే జనాల్లోకి వెళ్లిపోవాలి. ధమాకా సినిమాకి జరిగింది ఇదే. బీ,సిసెంటర్లో ధమాకా పాటలకి స్క్రీన్ పైకి వెళ్లి డ్యాన్స్ చేశారు ప్రేక్షకులు. రిలీజ్ రోజు కాదు.. వారం తర్వాత కూడా ప్రేక్షకుల్లో ఆ జోష్ కనిపించింది. ఇదంతా ధమాకా పాటల్లోని మ్యాజికే. ఇక వాల్తేరు వీరయ్య, వీరసింహా పాటలు కూడా అలరించాయి. సినిమాలో పాటలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు ముందే ప్రిపేర్ గా వున్నారు. అందుకే ఆ పాటలు బోర్ కొట్టించకుండా స్క్రీన్ టైం గడిచిపోయింది. ఫైట్లు విషయానికి వస్తే.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సూపర్ హీరోల ఇమేజ్.. ఫైట్లకి ప్లస్ అయ్యింది. భారీ ఫైట్లుని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా రొటీన్ కథలని ప్రేక్షకులు ఆదరించడానికి హీరోల ఇమేజ్ ని ఒక కారణం.
ఏదైనా రొటీన్ మాస్ మసాలా కథలకి మళ్ళీ మంచిరోజులు వచ్చాయి. అయితే ప్రేక్షకులు ఆదరించారు కదా.. ,మళ్ళీ వరుసగా ఇలాంటి కథలే రుద్దాలని చూస్తే మాత్రం తేడా కొట్టేసే ప్రమాదం వుంది. ఆల్బమ్ లో అన్ని చార్ట్ బస్టర్ నెంబర్ల ఉండేలా చూసుకోవాలి, డ్యాన్సులలో ఎక్కడా తగ్గకూడదు. మంచి హీరోయిజం, ఎంటర్ టైన్ మెంట్ వుండాలి. నిర్మాణంలో రాజీపడకూడదు. ప్రమోషన్స్ లో తగ్గకూడదు. ఇవన్నీ కలిసొస్తేనే.. రొటీన్ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే సంగతి గుర్తుంచుకోవాలి.