ఆగస్టు 15పై చిత్రసీమ చాలా ఆశలు పెట్టుకొంది. లాంగ్ వీకెండ్ కావడంతో థియేటర్లు కళకళలాడతాయని భావించింది. అందుకే ఒకేసారి 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘ఆయ్’తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం ‘తంగలాన్’ విడుదలయ్యాయి. అయితే ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. ‘ఆయ్’ డీసెంట్ కామెడీతో నిలదొక్కుకొంది. ‘తంగలాన్’కు మంచి రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాకు మెల్లమెల్లగా వసూళ్లు వస్తున్నాయి. ఉన్నంతలో ‘ఆయ్’ బెటర్ గా పెర్ఫార్మెన్స్ చేస్తోంది. ఈరోజు (సోమవారం) కూడా సెలవే. కాబట్టి ఇంకొన్ని వసూళ్లు దక్కే వీలుంది.
ఈ శుక్రవారం రెండు చిన్న సినిమాలు, రెండు రీ రిలీజు చిత్రాలూ విడుదలకు రెడీగా ఉన్నాయి. రావు రమేష్ ప్రధాన పాత్ర పోషించిన ‘మారుతి నగర్’, తమిళ డబ్బింగ్ చిత్రం ‘డిమాంటీ కాలనీ 2’ ఈవారం వస్తున్నాయి. దాంతో పాటు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు రీ రిలీజు కానున్నాయి. ఈమధ్య రీ రిలీజు ట్రెండ్ నిర్మాతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజున `మురారి`ని మళ్లీ రిలీజ్ చేశారు. దాదాపు రూ.7 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. `ఇంద్ర` చిత్రానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. షోలు అన్ని హోస్ ఫుల్స్ లోనే కనిపిస్తున్నాయి. మెల్లమెల్లగా థియేటర్లు కూడా పెంచుతున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కు… ఈ వారం స్పెషల్ అనుకోవాలి.