సాహిత్యంలో కథలకు పెద్ద పీటే ఉంది. తిలక్, గోపీచంద్, చలం, కొడవటిగంటి కుటుంబరావు.. ఇలా ఎంతోమంది గొప్ప కథకులు మర్చిపోలేని సాహిత్యాన్ని అందించి వెళ్లారు. ఈతరం కూడా బాగానే రాస్తోంది. తమ భావాలకు అక్షరాలతో కొత్త రూపు ఇస్తోంది. వెదకాలే..కానీ ఈకాలంలోనూ మంచి కథలు కనిపిస్తున్నాయి. వాటిని గుర్తించి ప్రోత్సహించాలంతే. ఆ ప్రయత్నమే చేస్తోంది తెలుగు 360. ప్రతీవారం ప్రధాన పత్రికల్లో వస్తున్న కథల్ని పాఠకులకు క్లుప్తంగా పరిచయం చేస్తోంది. ఈ కథలు మీలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించడమే కాదు. కొత్తగా కథలు రాయాలనుకొన్నవాళ్లకు ప్రోత్సాహం కూడా అందిస్తాయి. ఈవారం (ఆగస్టు 11) కథలపై ఓ లుక్ వేయండి.
కథ: ప్రకృతిలో సగం – ప్రకృతి సహజం
రచన: డా.మజ్జి భారతి
పత్రిక: ఈనాడు
అభ్యుదయ భావాలు, ఆదర్శాలు కల ఓ అమ్మాయి కథ ఇది. సమాజంలో పోరాట స్ఫూర్తి ఉన్న అమ్మాయిల్ని చూస్తే ముచ్చటేస్తుంటుంది. కానీ వాళ్లని మన ఇంటి కోడళ్లుగానో, జీవిత భాగస్వాములుగానో తెచ్చుకోవడానికి మనసొప్పుకోదు. ఇది పచ్చి నిజం. ఈ కథలో రమ్యకు అలాంటి అడ్డంకులే ఎదురవుతాయి. ఈ కథని మొదలు పెట్టడమే ఆడవాళ్లు ఎదుర్కొనే ఓ ప్రకృతి సహజమైన సమస్యతో మొదలెట్టారు. ఇలాంటి విషయాలు చర్చించడానికి, మాట్లాడడానికీ ఎందుకో ఈతరం కూడా వెనకడుగు వేస్తుంటుంది. ఈ విషయంలో రచయిత్రిని అభినందించాలి. కథంతా ఆదర్శాల చుట్టూ తిరుగుతుంది. అది కాస్త బోర్ కొట్టే విషయం. కథా శిల్పం విషయంలో రచయిత్రి ఇంకా సాధన చేయాలి.
కథ: గొప్ప సావు
రచన: రా.సా
పత్రిక: సాక్షి
”కష్టపడినవాళ్లంతా గొప్పగా బతకొచ్చేమో. కానీ గొప్ప చావు మాత్రం కొందరికే వస్తుంది” – ఈ మాట అర్థమవ్వాలgటే ‘గొప్ప సావు’ కథ చదవాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు మృత్యువు ఒడిలోకి చేరుకోవాల్సిందే. కానీ ఆ చావుకు అర్థముంటే అది గొప్ప చావు. సైనికుల త్యాగాన్ని సృజించిన కథ ఇది. మామూలు ఉద్యోగాలకూ, సరిహద్దుల్లో పని చేసే సైనికుడికీ ఉన్న వ్యత్యాసాన్ని చెప్పిన కథ ఇది. ఒక్కసారి చదవొచ్చు. గుండెల్ని నింపుకొనే ఉద్వేగం కోసం.
కథ: తూనీగ
రచన: అనిశెట్టి శ్రీధర్
పత్రిక: ఆంధ్రజ్యోతి
ఏ కథ చెబుతున్నాం అనేది ఎంత ప్రధానమో, ఎలా చెబుతున్నాం అనేదీ అంతే ముఖ్యం. కథకు ఫ్లో కావాలి. టెంపో ఉండాలి. దాన్ని శిల్పం కూడా అనొచ్చు. మామూలు విషయాన్నే అందంగా, ఆహ్లాదభరితంగా చెప్పొచ్చు. అదెలాగంటే ‘తూనీగ’ కథలోలా. ఓ అమ్మాయి. ఓ అబ్బాయి. ఇద్దరూ ప్రేమించుకొన్నారు. ఆ అబ్బాయి ప్రేమలో కామం ఉంది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ప్రేమపై అనుమానం ఉంది. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలని ఆ అబ్బాయి చేసే రకరకాల ప్రయత్నాలు, అమ్మాయిలోని భయాలూ.. వెరసి ఈ కథ. ఈ కథలో వ్యంగ్యం ఉంది. తమాషా ఉంది. సరదా ఉంది. సున్నితత్వం ఉంది. భయం కూడా ఉంది. చాలా ఫీలింగ్స్ ని క్యాప్చర్ చేసిన కథ. ఇలాంటి కథని ఇంత ఆహ్లాదకరంగానూ చెప్పొచ్చా? అనిపించింది. తప్పక చదవండి.
కథ: కోర్టు నోటీసు
రచన: ఎల్. శాంతి
పత్రిక: నమస్తే తెలంగాణ
పెళ్లయ్యాక ప్రతీ ఆడపిల్లా తన సొంత పేరు మర్చిపోతుందేమో. ఒసేయ్, ఎమేవ్, పిచ్చి ముండ, తింగరి దానా… ఇవే ఆ పేర్లకు పర్యాయపదాలవుతాయి. ఈ కథలోని స్త్రీ పాత్ర ఆవేదన కూడా అదే. పొద్దస్తమానూ భర్త పిలిచే పిలుపులు, ఇచ్చే సలహాలూ, చేసే ఫిర్యాదులూ భరించలేక కోర్టు నుంచి నోటీసులు పంపిస్తుంది. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ఈ కథ చదువుతున్నప్పుడు ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. భర్తలపై భార్యలకుండే కంప్లైంట్ ఈ కథలోని ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ముగింపు కాస్త సినిమాటిక్ గా ఉంది.
– అన్వర్