గత శుక్రవారం టాలీవుడ్‌కి కొత్త వెలుగొచ్చింది. సీతారామం, బింబిసార రెండూ హిట్ చిత్రాల జాబితాలో చేరాయి. థియేటర్ల దగ్గర మళ్లీ హడావుడి కనిపించింది. ఈ రెండు విజయాలూ చిత్రసీమకు కొత్త ఊపిరి అందించాయి. ఈ వారం మరో మూడు సినిమాలొస్తున్నాయి. రోజుకో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులో రెండు తెలుగు సినిమాలు. ఒక డబ్బింగ్ సినిమా ఉన్నాయి. మూడింటిలో ఒక్క హిట్టు పడినా టాలీవుడ్ లో సందడి కంటిన్యూ అవుతుంది.
ఈ గురువారం లాల్ సింగ్ చద్దా రిలీజ్ అవుతోంది. అమీర్‌ఖాన్ సినిమా అంటే దేశ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈసారి తెలుగులో ఇంకొంచెం ఎక్కువగానే ఉండబోతోంది. ఎందుకంటే ఈ సినిమాలో బాలరాజుగా నాగచైతన్య కనిపించబోతున్నాడు. చైతూకి ఇదే తొలి హిందీ సినిమా. ఇంత పెద్ద ప్రాజెక్టులో చైతూకి స్థానం దక్కడం.. విశేషమే. మరోవైపు అమీర్ ఖాన్ సినిమాని బాయ్‌కాట్ చేయాలని, దేశ వ్యాప్తంగా కొన్ని హిందూ సంఘాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాల్ సింగ్ చద్దాకి ఎలాంటి రిపోర్ట్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో టికెట్లు బాగా తెగే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
12న నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాస్, కమర్షియల్ హంగులతో నిండిన సినిమా ఇది. తొలిసారి నితిన్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతి శెట్టి, అంజలి (స్పెషల్ సాంగ్) గ్లామర్ ఈ సినిమాకి ప్లస్ కానుంది. ఈమధ్య మాస్ సినిమాలకే గిరాకీ కనిపిస్తోంది. బీ, సీలలో మంచి మాస్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్లంతా.. మాచర్లకు ఓటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
13న నిఖిల్ ‘కార్తికేయ 2’ వస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా కార్తికేయ 2 రూపొందింది. శ్రీకృష్ణుడి చరిత్రతో ముడి పడిన కథ ఇది. ఫాంటసీ, మైథలాజికల్ అంశాలతో పాటు మిస్టరీ కూడా జోడించారు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్ లాంటి స్టార్ తారాగణం.. ఈ సినిమాకి ప్లస్ కానుంది. విజువల్స్.. కూడా బాగున్నాయి. నిఖిల్ సినిమా విడుదలై చాలా కాలమైంది. ఈ సినిమా తన కెరీర్‌ని డిసైడ్ చేయబోతోంది. సరిగా తీయాలే గానీ దేవుడి టాపిక్ పై వచ్చిన కథలు బాక్సాఫీసు దగ్గర నిరుత్సాహ పరిచిన దాఖలాలు లేవు.కాబట్టి.. ‘కార్తికేయ 2’పై నమ్మకాలు పెట్టుకోవచ్చు.