కాంగ్రెస్ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్ల భారీ అవినీతి కేసు వ్యవహారం మెల్లగా హైదరాబాద్‌కు వస్తోంది. ఇటీవలి కాలంలో.. సీబీఐ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించి.. విచారణ జరుపుతోంది. విదేశీ మధ్యవర్తిని అరెస్ట్ చేసింది. స్వదేశంలో మీడియాటర్గా వ్యవహరించిన రాజీవ్ సక్సేనా అనే వ్యక్తి నుంచి అన్ని వివరాలు రాబట్టింది. రెండు, మూడు రోజుల క్రితం… అత్యంత గోప్యంగా.. హైదరాబాద్‌లోని అల్ఫాజియో అనే కంపెనీ యజమాని దినేష్ ఆళ్ల.. కార్యాలయాలు, ఇళ్లలో సీబీఐ సోదాలు చేసింది. అగస్టా డీల్‌తో.. దినేష్ ఆళ్లకు సంబంధం ఉందని సీబీఐ నమ్ముతోంది. సోదాల్లో రూ. 45 లక్షల నగదు.. రూ. 3 కోట్ల 10 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్‌లో.. రూ. 3,600 కోట్లు చేతులు మారాయని సీబీఐ చెబుతోంది. ఇలా చేతులు మారడంలో… దుబాయ్‌లో ఉండే… సక్సెనా కీలకంగా వ్యవహరించారు. ఈ సక్సేనాతో దినేష్ ఆళ్ల భారీగా లావాదేవీలు నిర్వహించారు. ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు పెట్టుకున్నారు. కానీ వీటన్నింటినీ రహస్యంగా ఉంచారు. సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి. దినేషన్ అల్ఫాజియో అనే కంపెనీతో పాటు..మరో మూడు కంపెనీలకు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నాలుగు కంపెనీల్లో మూడు అల్ఫాజియో పేరుతోనే ఉన్నాయి. ఒకటి మాత్రం మ్యాట్రిక్స్ ధర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుపై ఉంది. ఇందులో… దినేష్ ఆళ్లతో పాటు … కాసు అభిరాంరెడ్డి డైరక్టర్‌గా ఉన్నారు. ఈయన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్నారు. కాసు అభిరాంరెడ్డికి ఉన్న ఇతర కంపెనీల్లో.. కాసు మహేష్ రెడ్డి కూడా.. డైరక్టర్ గా ఉన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాఫ్టర్ల డీల్ కుదుర్చుకున్న దాని కంటే ముందే ఏపీ సర్కార్ కూడా.. ఓ హెలికాఫ్టర్ కొనుగోలు చేసింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్నారు. అగస్టా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మధ్యవర్తికి ఏపీతో అనుబంధం ఉందని ముందు నుంచి దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు.. నేరుగా హైదరాబాద్ బేస్డ్ కంపెనీల ఓనర్‌పైనే దాడులు చేసి.. వాటికి సంబంధించిన సాక్ష్యాలు దొరకబుచ్చుకోవడం ఆసక్తికరంగా మారింది. కొసమెరుపేమిటంటే… అగస్టా కుంభకోణంలో తెలంగాణ గవర్నర్ నరసింహన్ కూడా సాక్షి. అగస్టా హెలికాప్టర్లు కొనుగోలు చేసే సమయంలో నరసింహన్ కేంద్రంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. హెలిక్టాప్టర్ల కొనుగోలు సందర్భం గా జరిగిన పలు సమావేశాలకు ఐబీ చీఫ్ హోదాలో నరసింహన్ కూడా హాజరయ్యారు.