మన పొరుగు దేశమయిన మయన్మార్ లో సుమారు 53సం.ల తరువాత మొదటిసారిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. మయన్మార్ పార్లమెంటు ఉభయసభలకు ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆంగ్ సాన్ సూ కీ నేతృత్వంలో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ (ఎన్.ఎల్.డి. పార్టీ) ఇంత వరకు అధికారంలో కొనసాగుతున్న మిలటరీ యూనియన్ సోలిడారిటీ అండ్ డెవెలప్ మెంట్ పార్టీపై ఘన విజయం సాధించింది.
ఉభయసభలలో కలిపి మొత్తం 664 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 329 సీట్లు అవసరం కాగా సూకీ పార్టీకి మొత్తం 348 సీట్లు వచ్చేయి. ఇంతవరకు అధికారంలో ఉన్న మిలటరీ పార్టీకి కేవలం 40 సీట్లు మాత్రమే గెలుచుకొంది. ముందు జాగ్రత్తగా అది చేసిన చట్ట సవరణల కారణంగా ఉభయ సభలలో దానికి మద్దతు పలికే మిలటరీ అధికారులకి చెరో 25 సీట్లు చొప్పున మొత్తం 50 సీట్లు పోటీ చేయకుండానే దక్కుతాయి. అంటే మిలటరీ పార్టీ మొత్తం 90 సీట్లు గెలుచుకొన్నట్లన్న మాట. ఏడు స్థానాలలో ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన స్థానాలలో ఇంకా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇప్పటికే ఎన్.ఎల్.డి.పార్టీ మెజార్టీ స్థానాలు లభించాయి కనుక ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిశ్చయం అయిపోయినట్లే. ఇంతవరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే మిగిలిన స్థానాలలో కూడా ఎన్.ఎల్.డి.పార్టీ అత్యధికంగా గెలుచుకొనే అవకాశం ఉన్నట్లు భావించవచ్చును.
ఈ ఫలితాలు మయన్మార్ దేశ ప్రజలు మిలటరీ పాలన నుండి విముక్తి కోరుకొంటున్నట్లు స్పష్టమయింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు తెయిన్ సేన్ స్థానంలో త్వరలోనే ఎన్.ఎల్.డి.పార్టీ కొత్త దేశాధ్యక్షుడిని ఎన్నుకొంటుంది. ఆయన లేదా ఆమె ఆదేశాలతో ఎన్.ఎల్.డి. పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజాస్వామ్యం కోసం శతాబ్దాలు తరబడి పోరాడిన సూకీ దేశాధ్యక్ష పదవి చేప్పట్టకుండా ఉండేందుకు ఇంతవరకు అధికారంలో ఉన్న మిలటరీ ప్రభుత్వం కొన్ని చట్ట సవరణలు చేసింది. కనుక సూకీ నేరుగా దేశాధ్యక్ష పదవిని చేప్పట్టలేరు. కానీ ఆమే పరోక్షంగా ప్రభుత్వాన్ని నడిపించబోతున్నారు. ఆమె ప్రస్తుత దేశాధ్యక్షుడు తెయిన్ సేన్ మరియు సీనియర్ మిలటరీ జనరల్ అనుగ్ హ్లేఇంగ్ మరియు స్పీకర్ ష్వీమన్ ను సమావేశానికి ఆహ్వానించారు.
గత ఐదు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న మిలటరీ ప్రభుత్వం ఈ ఎన్నికలలో పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. కానీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన సూకీ ప్రభుత్వానికి సహకరిస్తామని సీనియర్ మిలటరీ జనరల్ అనుగ్ హ్లేఇంగ్ చెప్పారు. అధికారానికి, తద్వారా విలాసవంతమయిన జీవితానికి అలవాటుపడిన మిలటరీ పాలకులు రక్తం రుచి మరిగిన పులి వంటివారని అందరూ అంటారు. కనుక ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన సూకీ ప్రభుత్వాన్ని వారు ఎన్ని రోజులు నడువనిస్తారో ఎవరూ చెప్పలేరు. సూకీ మాత్రం తమ ప్రభుత్వం దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్య విధానాలను అమలు చేస్తుందని నమ్మకంగా చెపుతున్నారు. ఆమె నేరుగా దేశాధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేదు కనుక ప్రభుత్వం నడిపించేందుకు అవసరమయిన పదవిని సృష్టించుకొని, ఆ తరువాత చట్ట సవరణలు చేసి పూర్తి అధికారాలు పొందే ప్రయత్నం చేయవచ్చును.