అరబిందో అనే సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను కమ్మేస్తోంది. అరబిందో ఫార్మాగా మాత్రమే పరిచయమైన ఈ సంస్థ ఇటీవలికాలంలో అరబిందో రియాల్టీని ప్రారంభించింది. హైదరాబాద్‌లో రెండు, మూడు రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్మిస్తోంది. ఇంకా పూర్తి చేయలేదు. కానీ ఏపీ మొత్తం కమ్మేస్తోంది. కాకినాడ పాత పోర్టు.. కొత్త పోర్టు రెండింటిని కేవసం చేసుకుంది. కాకినాడ సెజ్ ను కైవసం చేసుకుంది. రామాయపట్నం పోర్టులోనూ అరబిందో పేరు వినిపిస్తోంది. విశాఖలో కొన్ని వేల ఎకరాలను కొనుగోలు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖలో ఓ రిసార్ట్‌ను సైతం కబ్జా చేసిందని చెబుతున్నారు.
అరబిందో సంస్థ పేరు ఏపీలో ఒక్క పోర్టుల విషయంలోనే కాదు.. చాలా వ్యాపార ఒప్పందాల్లో వినిపిస్తోంది. 108 వాహనాల కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కింది. అప్పుడే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత విశాఖ పట్నంలో ఓ రిసార్ట్‌ను కైవసం చేసుకునే విషయంలోనూ ఈ సంస్థ పేరు వినిపించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించక ముందు.. విశాఖలో కొన్ని వేల ఎకరాలను కొనుగోలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. రామాయపట్నం పోర్టు విషయంలో ఏపీ సర్కార్ నాన్ మేజర్ పోర్టుగా నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవంగా అది మేజర్ పోర్టు. కేంద్రం విభజన చట్టంలో భాగంగా నిర్మించాల్సి ఉంది. కానీ రామాయపట్నం పోర్టును కూడా అరబిందోకు కట్టబెట్టాలన్న లక్ష్యంతోనే నాన్ మేజర్ పోర్టుగా మార్చి ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాన్ మేజర్ పోర్టుగా మార్చడం వల్ల నిర్మాణంతో కేంద్రానికి సంబంధం లేదని .. పార్లమెంట్లో కేంద్రమంత్రి ప్రకటించారు.
అరబిందో కేంద్రంగా సాగుతున్న ఏపీలో వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు అనేక రకాల అనుమానాలకు కారణం అవుతున్నాయి. అరబిందో సంస్థలో విజయసాయిరెడ్డి అల్లుడు డైరక్టర్‌గా ఉన్నారని అందుకే అన్ని పోర్టులు ఆ సంస్థకే కట్టబెడుతున్నారని.. ఓ రకంగా కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దోచుకున్న సొమ్మును పోర్టుల ద్వారా దేశం తరలిస్తున్నారని వారు ఆరోపిస్తున్నా రు. ఈ వ్యాపార ఒప్పందాల్లో అరబిందో.. వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు లెక్క. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది.. నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తోంది.. అన్న విషయాలను గోప్యంగానే ఉంచుతున్నారు. దీంతో ప్రజల్లో అనుమానాలు బలపడుతున్నాయి.